Kiren Rijiju: ‘న్యాయవాదుల అధిక ఫీజులపై నియంత్రణ కష్టమే’

కొంతమంది న్యాయవాదుల ఫీజులను నియంత్రించడం, వాటిపై పరిమితి విధించడం కష్టమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే, పేదల కేసులను ఉచితంగా, లేదా తక్కువ ఫీజులకు వాదించేలా న్యాయవాదులను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతోన్నాయన్నారు...

Published : 05 Feb 2022 02:25 IST

దిల్లీ: కొంతమంది న్యాయవాదుల ఫీజులను నియంత్రించడం, వాటిపై పరిమితి విధించడం కష్టమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే, పేదల కేసులను ఉచితంగా, లేదా తక్కువ ఫీజులకు వాదించేలా న్యాయవాదులను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు సుప్రీం కోర్టు, హైకోర్టుల్లోని ఖాళీల భర్తీకి కేంద్రం, సుప్రీం కోర్టు కొలీజియం కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరమైనందున.. ఈ ప్రక్రియ కొంత ఆలస్యమవుతోందని తెలిపారు. న్యాయమూర్తుల ఖాళీలపై లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నపై మంత్రి శుక్రవారం ఈ మేరకు సమాధానమిచ్చారు. నియామకాలనేవి సమయం తీసుకునే ప్రక్రియ కాబట్టి.. ఎప్పుడూ కొన్ని ఖాళీలు కనిపిస్తాయన్నారు.

‘కొంతమంది న్యాయవాదుల ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయన్న మాట వాస్తవమే. సాధారణ ప్రజలు వారిని నియమించుకోలేరు. కానీ, వాటిని కట్టడి చేయడం ప్రభుత్వానికీ కష్టమే. ఈ నేపథ్యంలో పేదల కేసులను ఉచితంగా లేదా కనీస ఫీజులతో వాదించేందుకు మంచి న్యాయవాదులు ముందుకు రావాలి. యువ లాయర్లను ఈ దిశగా ప్రోత్సహించాలి. ఈ క్రమంలోనే అధిక ఫీజుల బాధ రాకుండా, ఇబ్బందులు కలగకుండా అందరికీ న్యాయం అందేలా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం’ అని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రతిపాదిత మధ్యవర్తిత్వ బిల్లు (మీడియేషన్‌ బిల్లు)పై మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ముసాయిదా బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపినట్లు తెలిపారు. ఈ బిల్లు సామాన్యులకు ఉపశమనం కల్పించగలదని భావిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే ముందు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని