Disha Salian: మాకు న్యాయం చేయండి.. లేకపోతే చావే శరణ్యం..!

రాజకీయ కారణాలతో తన కుమార్తె పేరును చెడుగా ఉపయోగిస్తున్నారని అనుమానాస్పదంగా మృతి చెందిన దిశా సాలియన్ తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు.

Published : 26 Mar 2022 02:17 IST

రాష్ట్రపతిని న్యాయం కోరిన దిశ కుటుంబ సభ్యులు

ముంబయి: రాజకీయ కారణాలతో తన కుమార్తె పేరును చెడుగా ఉపయోగిస్తున్నారని అనుమానాస్పదంగా మృతి చెందిన దిశా సాలియన్ తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. నిత్యం తమకు ఎదురవుతోన్న వేధింపులతో తమ జీవితం దారుణంగా మారిందని, తమకు న్యాయం చేయాలని ఆవేదన చెందారు. తమ చుట్టూ జరుగుతోన్న పరిస్థితులతో తమ జీవితాలను ముగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ లేఖలో వాపోయారు. ఈ దిశా సాలియన్ .. రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వద్ద మేనేజర్‌గా పనిచేశారు. ఆయన మరణానికి కొన్ని రోజుల ముందే దిశా ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరి మృతి 2020లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

‘నా కుమార్తె పేరును చెడుగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు విజ్ఞప్తి చేశాం. ఇదే పిటిషన్‌ను ప్రధానమంత్రి, హోం మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపాం’ అంటూ దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

‘నా కుమార్తె మరణం, ఆ తర్వాత చోటుచేసుకున్న సుశాంత్‌ మృతితో ముడిపెడుతూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కొందరు ఊహాజనిత సమాచారాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్‌ ఠాక్రేతో ఉన్న విరోధం కారణంగా నారాయణ్ రాణె, నితేశ్ రాణె ఈ విషయంలో తలదూర్చారు. వారి రాజకీయ వైరంలోకి మమ్మల్ని లాగారు. మా జీవితాలను దుర్భరంగా మార్చారు. జూన్ 4, 2020 నుంచి నా కుమార్తె తను ఉండే ఇంటి నుంచి బయటకు రాలేదని తన స్నేహితుల ద్వారా తెలిసింది. అక్కడున్న సీసీ కెమెరాల ద్వారా అసలు విషయం బయటపెట్టండి.

కానీ, నారాయణ్‌, నితేశ్‌ మాత్రం కొందరు వ్యక్తులు దిశ గదిలోకి ప్రవేశించి, అత్యాచారం చేశారని చెబుతూనే ఉన్నారు. ఇవి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. వాటి వల్ల మేం తలెత్తుకోలేకపోయాం. మేం చివరకు ప్రశాంతంగా బాధపడలేకపోయాం. వీరి తప్పుడు ఆరోపణలతో నా కుమార్తె వ్యక్తిత్వాన్ని కించపర్చడం మమ్మల్ని తీవ్రంగా గాయపర్చింది. వీటన్నింటిని చూసి, చనిపోవాలని ఎన్నోసార్లు అనుకున్నాం. మమ్మల్ని ఇంత క్షోభకు గురిచేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేకపోతే మాకు చావే శరణ్యం’ అంటూ ఆ లేఖలో తీవ్రంగా వాపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు