China Rocket: తొలిసారి పెదవి విప్పిన డ్రాగన్‌

చైనా ప్రయోగించిన రాకెట్‌ శకలాలు భూమిపై పడనుందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఈ వారాంతంలోనే అవి భూమిని తాకనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయంపై ఇంతవరక.......

Updated : 07 May 2021 18:21 IST

బీజింగ్‌: చైనా ప్రయోగించిన రాకెట్‌ శకలాలు భూమిపై పడనున్నాయన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఈ వారాంతంలోనే అవి భూమిని తాకనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయంపై ఇంతవరకు పెద్దగా పట్టనట్లు వ్యవహరించిన చైనా.. తొలిసారి స్పందించింది. రాకెట్‌ శకలాలు భూమిని తాకే లోపలే అవి కాలిపోతాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు దాదాపు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

తాము ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ ఏప్రిల్‌ 29న కోర్‌ మాడ్యూల్‌ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నియంత్రణ కోల్పోవడంతో అది భూమివైపు దూసుకొస్తోందని వెన్‌బిన్‌ తెలిపారు. అయితే, రాకెట్‌ భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పటికే పూర్తిగా కాలిపోతుందని తెలిపారు. భూమిపై పడి నష్టం కలిగించడం అనేది దాదాపు జరగకపోవచ్చని చెప్పారు. సంబంధిత అథారిటీ ఎప్పటికప్పుడు దీనిపై వివరాలు అందిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు చైనాకు చెందిన పలువురు నిపుణులు మాత్రం ఈ రాకెట్‌ అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. జనావాసాలపై కూలే ముప్పు అత్యల్పమని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ నిపుణుడు జొనాథన్‌ మెక్‌డొవెల్‌ సైతం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని