పెళ్లిలో వీరంగం: కలెక్టర్‌పై వేటు

ఏప్రిల్‌ 26వ తేదీన త్రిపురలోని వెస్ట్‌ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్‌(డీఎం) ఓ పెళ్లిలో దౌర్జన్యం చేసిన వీడియో దేశవ్యాప్తంగా

Published : 04 May 2021 01:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏప్రిల్‌ 26న త్రిపురలోని వెస్ట్‌ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్‌(డీఎం) ఓ పెళ్లిలో దౌర్జన్యం చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. డీఎం శైలేష్‌కుమార్‌ యాదవ్‌ను విధుల నుంచి తప్పించింది. దీనిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రతన్‌లాల్‌నాథ్‌ సోమవారం మాట్లాడుతూ..‘‘యాదవ్‌ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌కుమార్‌కు ఆదివారం ఒక లేఖ రాశారు. ఏప్రిల్‌ 26వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి తనపై జరిగే విచారణ నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో విధుల నుంచి తప్పించాలని కోరారు. దీంతో ఆ బాధ్యతలను హేమేంద్ర కుమార్‌కు అప్పగించాము’’ అని పేర్కొన్నారు.

ఇక కలెక్టర్ శైలేష్‌ కుమార్‌ యాదవ్‌ తన లేఖలో ‘‘నిస్పక్షపాత విచారణ నిమిత్తం వెస్ట్‌ త్రిపుర జిల్లా కలెక్టర్‌, డీఎం బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా కోరుతున్నాను’’ అని పేర్కొన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొంది. 

ఏప్రిల్‌26 ఏమి జరిగింది..?

త్రిపురలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాత్రిపూట కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చే అధికారాన్ని డీఎంకు కట్టబెట్టారు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు, త్రిపురకు చెందిన వధువుతో 26వ తేదీ రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి వారు శుభలేఖతోపాటు, వినతిపత్రాన్ని డీఎం ఆఫీస్‌లో ఇచ్చి అనుమతి తీసుకొన్నారు. 26న పరిమిత అతిథులతో పెళ్లి వేడుకలు జరుగుతుండగా.. రాత్రి 10 సమయంలో డీఎం శైలేష్‌ కుమార్‌ యాదవ్‌ పోలీసులతో కలిసి కల్యాణ మండపంపై దాడి చేశారు. చాలా ఆవేశంగా కనిపించిన వారిని కొడుతూ.. అసభ్య పదజాలంతో తిడుతూ మండపాన్ని ఖాళీ చేయించారు. అడ్డొచ్చిన వారిని అరెస్టు చేయమంటూ విచ్చలవిడిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పెళ్లికొడుకు, పురోహితుడిపై చేయి చేసుకొన్నారు. తమ వద్ద డీఎం ఆఫీస్‌ ఇచ్చిన అనుమతి ఉందని ఓ మహిళ చూపించగా.. ఆ పత్రాన్ని చింపి సినీఫక్కీలో ఆమెపై విసిరేశారు. పదుల సంఖ్యలో అతిథులను అర్ధరాత్రి వరకు పోలీసుల అదుపులో ఉంచారు. ఈ క్రమంలో ఆ ప్రాంత పోలీసులు డబ్బుకు లొంగిపోయారని ఆరోపించారు. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. సోనూనిగమ్‌ వంటి సెలబ్రిటీలు డీఎం తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్‌ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత శైలేష్‌ సారీ చెప్పినట్లే చెప్పి మాట మార్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని