Agriculture Budget: తమిళనాడులో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌

తొలిసారి వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎంకే ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో దీన్ని సమర్పించింది..

Updated : 14 Aug 2021 19:20 IST

తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డీఎంకే ప్రభుత్వం

చెన్నై: తమిళనాడులో తొలిసారి వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎంకే ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో దీన్ని సమర్పించింది. ఇందులో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.34,220.65 కోట్లు కేటాయించింది. వ్యవసాయంతోపాటు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, పట్టుపురుగుల పెంపకం తదితర అనుబంధ రంగాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం బడ్జెట్‌ సమర్పిస్తూ మాట్లాడారు. రైతులు, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ పద్దును రూపొందించినట్లు  తెలిపారు. ఇది కర్షకుల ఆకాంక్షలకు ప్రతీక.. వారి కల అని పేర్కొన్నారు.

ఆయా ప్రధానాంశాలు

* పొలాల్లో విద్యుత్‌ మోటర్లకు ఉచితంగా కరెంటు సరఫరా కోసం తమిళనాడు విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా కార్పొరేషన్‌కు రూ.4508.23 కోట్లు కేటాయింపు

* వ్యవసాయ సంబంధిత పరిశ్రమల ప్రోత్సాహానికి కావేరి డెల్టా ప్రాంతాన్ని ‘వ్యవసాయ పారిశ్రామిక కారిడార్‌’గా ప్రకటన.

* రాష్ట్రవ్యాప్తంగా 12,524 గ్రామాల్లో వ్యవసాయాభివృద్ధి, స్వయం సమృద్ధి సాధనకు రూ.1,245.45 కోట్లతో ప్రత్యేక పథకం అమలు. ఈ ఏడాది తొలుత 2500 గ్రామాల్లో శ్రీకారం.

* వర్షాధార సాగు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మూడు లక్షల హెక్టార్లలో ‘ముఖ్యమంత్రి మెట్టభూముల అభివృద్ధి మిషన్’ అమలు.

* సేంద్రియ సాగుకు ప్రోత్సాహం దిశగా ‘సేంద్రియ వ్యవసాయ అభివృద్ధి పథకం’ అమలుకు రూ.33.03 కోట్లు కేటాయింపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని