Kejriwal: వాటిని ‘ఉచితాలని’ చెప్పి సామాన్యుడిని అవమానపరచొద్దు : కేజ్రీవాల్‌

సామాన్యులు, పేదలకు కల్పించే వసతులను ఉచితాలు అని పేర్కొంటూ.. వారిని అవమాన పరచొద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Published : 23 Oct 2022 17:38 IST

దిల్లీ: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. భాజపా, ఆమ్‌ఆద్మీ పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీలు చేస్తోన్న వాగ్దానాలపై విమర్శలూ చేసుకుంటున్నాయి. నేపథ్యంలో ధరల పెరుగుదలతో బాధపడుతోన్న సామాన్య ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా ఎందుకు అందించకూడదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. అటువంటి వాటిని ‘ఉచితాలు’ అని పేర్కొంటూ సామాన్య పౌరుడిని అవమానపరచొద్దని హితవు పలికారు. ఉచితాల పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు గిమ్మిక్కులకు పాల్పడుతున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు బదులుగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ విధంగా స్పందించారు.

‘ధరల పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్యులు విద్య, వైద్యం, ఔషధాలు, కరెంటు ఉచితంగా ఎందుకు పొందకూడదు..? రాజకీయ నాయకులు ఎన్నో వసతులు ఉచితంగా పొందుతున్నారు. చాలా మంది ధనికులకు బ్యాంకులు రుణాలను మాఫీ చేస్తున్నాయి. ఉచితాలు అని పదే పదే చెప్పి సామాన్య పౌరులను అవమానించొద్దు’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో పీఎంఏవై లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేయించిన సందర్భంగా మాట్లాడిన మోదీ.. గతంలో ప్రభుత్వాలు గరీబీ హఠావో వంటి నినాదాలిచ్చినా అవి రాజకీయ గిమ్మిక్కులు మాత్రమేనని పేర్కొన్నారు. ఆ సమయంలో పన్ను చెల్లింపుదారుల ఆలోచనను ప్రస్తావించారు. తమ నుంచి వసూలు చేసిన డబ్బును ఉచితాలకు ఉపయోగిస్తే పన్నుచెల్లింపుదారులు ఎంతో బాధపడతారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని