వైద్యుడి నిర్వాకం: డెలివరీ చేసి.. కడుపులో టవల్‌ వదిలేశాడు..!

వైద్యుడి నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రసవ వేదనతో ఆసుపత్రికెళితే ఆపరేషన్‌ చేసి కడుపులోనే టవల్ ఉంచేశారు అక్కడి సిబ్బంది. ఈ దారుణమైన ఘటన యూపీలో చోటుచేసుకుంది.

Published : 04 Jan 2023 15:53 IST

లఖ్‌నవూ: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణికి ఆపరేషన్ చేశాడో వైద్యుడు. బిడ్డను బయటకు తీసి కడుపులో టవల్‌ (Towel) వదిలేశాడు. విషయం తెలియని ఆ మహిళ కడుపునొప్పితో బాధపడింది. భరించలేక మరో ఆసుపత్రికెళితే అక్కడ ఈ వైద్యుడి నిర్వాకం బయటపడింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh)లో చోటుచేసుకుంది.

అమ్రోహా ప్రాంతానికి చెందిన నజ్రానా అనే మహిళ కొద్ది రోజుల క్రితం ప్రసవ వేదనతో స్థానిక సైఫీ నర్సింగ్‌ హోంలో చేరింది. అక్కడ వైద్యుడు మత్లూబ్‌, ఆయన సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా టవల్‌ను ఆమె పొట్టలోనే ఉంచి కుట్లేశారు. ఆపరేషన్‌ తర్వాత నజ్రానా కడుపునొప్పి ఎక్కువగా ఉందని చెప్పింది. కానీ, ఆ డాక్టర్‌.. బయట చలి ఎక్కువగా ఉండటం వల్ల అలా జరిగిందని చెప్పి మరో ఐదు రోజులు ఆసుపత్రిలోనే పరిశీలనలో ఉంచాడు.

ఇంటికి వచ్చాక కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో ఆమె భర్త మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత వైద్యులు ఆమెకు మరో ఆపరేషన్‌ చేసి టవల్‌ను బయటకు తీశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ సింఘాల్‌ స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. మత్లూబ్‌ నిర్వహిస్తున్న ఆ ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేవని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని