16 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్‌.. 41 ఏళ్లకే హార్ట్‌ఎటాక్‌తో మృతి

వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో గుండెపోటుతో యువత, మధ్యవయస్కులు గుండెపోటుతో మరణించిన ఘటలను చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌కు చెందిన ఓ ప్రముఖ కార్డియాలజిస్ట్ గుండెపోటుతో మృతి చెందారు.

Updated : 07 Jun 2023 18:40 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌( Gujarat)లోని జామ్‌నగర్‌ (Jamnagar) ప్రాంతంలో ఆయనో ప్రముఖ కార్డియాలజిస్ట్‌ (Cardiologist). ఎన్నో వేల మందికి గుండె ఆపరేషన్లు చేశారు. అంతేకాదు, గుండె జబ్బుల (Heart Diseases)పై నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఆయన నిన్న అనూహ్యంగా గుండెపోటు (Heart Attack)తో మృతిచెందారు. జామ్‌నగర్‌లో డాక్టర్‌ గౌరవ్‌ గాంధీ (41) కార్డియాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆయన గురించి తెలియని వారు లేరు. సుమారు 16 వేల మందికి పైగా రోగులకు ఆయన గుండె ఆపరేషన్లు చేశారు. కానీ, ఆయన మంగళవారం ఉదయం గుండెపోటుతో చనిపోయినట్లు కుంటుంబసభ్యులు తెలిపారు. డాక్టర్‌ గాంధీ మృతివార్త రోగులు, ఆస్పత్రి వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఇటీవలి కాలంలో యువకులు, మధ్య వయస్కులు ఎక్కువగా గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జామ్‌నగర్‌ ప్రాంతంలో గుండెకు సంబంధించిన రోగాలపై డాక్టర్ గాంధీ నిర్వహించిన కార్యక్రమాలను ఆయన వద్ద చికిత్స పొందినవారు గుర్తుచేసుకుంటున్నారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూలానే డాక్టర్‌ గాంధీ సోమవారం రాత్రి ఆస్పత్రిలో తన పని ముగించుకొని ప్యాలెస్‌ రోడ్‌లో ఉన్న ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. రోజూ ఉదయం ఆరు గంటలకల్లా నిద్రలేచేవారని, మంగళవారం ఉదయం ఆరు గంటలు దాటినా..  లేవకపోవడంతో ఆయన్ను దగ్గరకు వెళ్లి పిలవగా స్పందించలేదని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఆయన్ను కదిలించి చూడగా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆస్పత్రికి తరలించామని.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబసభ్యులు వెల్లడించారు. డాక్టర్‌ గాంధీ మృతి గురించి పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన గుండెపోటుతో చనిపోవడం దురదృష్టకరమని అంటున్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని