Covid 19: ఇకనైనా తప్పుడు వైద్యాన్ని ఆపించండి: ప్రభుత్వాలకువైద్యుల లేఖ

కరోనా విషయంలో గతేడాదిలో చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతమవుతున్నాయని దేశ, విదేశాల్లోని పలువురు భారతీయ సీనియర్‌ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ బాధితులకు అందిస్తున్న వైద్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వెంటనే ఈ తప్పుడు వైద్య చికిత్సను నిలిపివేసేలా

Updated : 15 Jan 2022 13:45 IST

దిల్లీ: కరోనా విషయంలో గతేడాదిలో చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతమవుతున్నాయని దేశ, విదేశాల్లోని పలువురు భారతీయ సీనియర్‌ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ బాధితులకు అందిస్తున్న వైద్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వెంటనే ఈ తప్పుడు వైద్య చికిత్సను నిలిపివేసేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ  లేఖ రాశారు.

‘‘కొవిడ్‌ బాధితుల్లో చాలా మందికి కరోనా లక్షణాలు కనిపించట్లేదు. మరికొందరికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. అలాంటి వారికి పెద్దగా వైద్య చికిత్స అవసరం ఉండదు. కానీ, అనవసరంగా ఔషధాలు ఇస్తూ వారిని మరింత అనారోగ్యానికి గురయ్యేలా చేస్తున్నారు. కొవిడ్‌ చికిత్సకు ప్రస్తుతం ఇస్తున్న ఔషధాలు అహేతుకమైనవి. ఈ ఔషధాల వినియోగం వల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదముంది. గతేడాది బ్లాక్‌ ఫంగస్‌ ప్రబలడానికి ఈ అనవసరపు ఔషధాల వినియోగమే కారణం. కొంతమంది వైద్యులు అవసరం లేకపోయినా సీటీ స్కాన్‌, డీ-డైమర్‌ వంటి పరీక్షలు చేయించుకోవాలని బాధితులకు సూచిస్తున్నారు. ఇది బాధిత కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా మారుతాయి. కొన్ని ఆస్పత్రులు కొవిడ్‌ బాధితుల్ని భయపెట్టి ఆస్పత్రిలో చేరేలా చేస్తున్నాయి. దీంతో కరోనా తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారికి ఆస్పత్రిలో పడకలు అందుబాటులో లేకుండాపోతున్నాయి. ఇలాంటి చర్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెడికల్‌ అసోసియేషన్లు ఈ అంశాలపై దృష్టి సారించాలి’’అని వైద్యులు పేర్కొన్నారు. 

కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి రాసిన ఈ లేఖలో సంతకాలు చేసిన వారిలో ముంబయిలోని జస్లోక్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ సంజయ్‌ నాగ్రాల్‌, కేరళలోని రాజ్‌గిరి ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ సిరియక్‌ ఫిలిప్‌, బెంగళూరుకి చెందిన డాక్టర్‌ రాజనీ భట్, యూఎస్‌, కెనడాకు చెందిన మరికొందరు భారతీయ వైద్యులు సహా మొత్తం 32 మంది వైద్యులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు