Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్‌ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు

‘కాళీ’ పేరుతో తీసిన ఓ డాక్యుమెంటరీకి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర దర్శకురాలు లీలా మణిమేకలై సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

Updated : 05 Jul 2022 15:24 IST

ప్రాణం పోయినా తగ్గనంటోన్న దర్శకురాలు లీనా మణిమేగలై

దిల్లీ: మత విశ్వాసాలను దెబ్బతీసే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోన్న వేళ.. తాజాగా మరో ఘటన వివాదానికి కేంద్ర బిందువయ్యింది. ‘కాళీ’ (Kaali) పేరుతో తీసిన ఓ డాక్యుమెంటరీకి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర దర్శకురాలు లీనా మణిమేగలై (Leena Manimekalai) సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అయితే, హిందూ దేవతను కించపరిచేలా ఆ పోస్టర్‌ ఉండడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. అది మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ దిల్లీలోనూ ఫిర్యాదు నమోదైనట్లు తెలుస్తోంది. వీటిపై మీడియాలో వస్తోన్న కథనాలపై స్పందించిన చిత్ర దర్శకురాలు మణిమేగలై మాత్రం.. తాను బతికి ఉన్నంతవరకు నిర్భయంగా తన గళాన్ని వినిపిస్తానని చెప్పడం గమనార్హం.

‘నేను కోల్పోయేది ఏమీ లేదు. నేను బతికి ఉన్నంతవరకూ నేను విశ్వసించిన మాటలను భయం లేకుండా వినిపిస్తా. అందుకు నా ప్రాణమే మూల్యమైతే.. దాన్ని కూడా చెల్లించుకునేందుకు సిద్ధమే’ అని ఈ వివాదంపై మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ దర్శకురాలు మణిమేగలై ట్విటర్‌లో పోస్టు చేశారు.

తమిళనాడు మధురైకి చెందిన లీనా మణిమేగలై.. ‘రిథమ్స్‌ ఆఫ్‌ కెనడా’లో భాగంగా ‘కాళీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటో ఉన్న అగాఖాన్‌ మ్యూజియం (Aga Khan Museum)లో విడుదల చేశారు. ఓ సాయంత్రం పూట మహిళ షికారు చేసే నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని దర్శకురాలు పేర్కొన్నారు. అయితే, ఆ పోస్టర్‌ దేవతా మూర్తిని కించపరిచేలా ఉండడంతో సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ArrestLeelaManimekalai హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. మతవిశ్వాసాలను దెబ్బతీయడమే కాకుండా దేవతా మూర్తులను కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూసేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా దిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలాఉంటే, సెక్సీ దుర్గా (Sexy Durga) పేరుతో 2017లో మలయాళీ చిత్ర దర్శకుడు సనాల్‌ కుమార్‌ శశిధరన్‌ తీసిన చిత్రం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కేరళలో కొన్ని వర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి కూడా అది కారణమయ్యింది. గతేదాడి వచ్చిన ‘తాండవ్ (Tandav)‌’ చిత్రం కూడా తీవ్ర విమర్శలకు గురయ్యింది. తాజాగా కాళీ (Kaali) డాక్యుమెంటరీపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని