Omicron Wave: భారత్‌లో మూడోవేవ్‌.. గరిష్ఠ స్థితి దాటినట్లేనా?

దేశంలో థర్డ్‌ వేవ్‌ గరిష్ఠ స్థితి దాటినట్లేనా అని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది.

Updated : 04 Feb 2022 17:19 IST

దిల్లీ: అత్యంత సంక్రమణ సామర్థ్యం కలిగిన ఒమిక్రాన్‌ వేరియంట్‌తో భారత్‌లో మూడో వేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువయ్యాయి. అయితే, గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో థర్డ్‌ వేవ్‌ గరిష్ఠ స్థితి దాటినట్లేనా అని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. వేవ్‌, పీక్‌ వంటి పదాలను పక్కనబెడితే.. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు, పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లే కన్పిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

‘కేవిడ్‌ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. 297 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైన ఉండగా.. 169 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతంగా ఉంది. 268 జిల్లాల్లో మాత్రం పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువే నమోదయ్యింది. వేవ్‌, పీక్‌ వంటి పదాలను తాము ఉపయోగించాలనుకోవడం లేదు. పలు ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మొత్తంగా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నందున కొవిడ్‌ను ఎదుర్కొనే వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం అంది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మాత్రం దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి అదుపులోకి వస్తున్నట్లే కనిపిస్తోందన్నారు.

తగ్గుతున్న పాజిటివిటీ రేటు..

ఒమిక్రాన్‌ ప్రభావంతో జనవరి నెలలో దేశంలో కొవిడ్‌ మూడోవేవ్‌ ఉద్ధృతి స్పష్టంగా కనిపించింది. నిత్యం పెరుగుతూ వెళ్లిన కొవిడ్‌ కేసులు, జనవరి 21వ తేదీ నాటికి 3 లక్షల 47 వేలకు చేరింది. ఈ వేవ్‌లో రోజువారీ కేసుల్లో అదే గరిష్ఠం. అప్పటి నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఫిబ్రవరి 3 నాటికి ఆ సంఖ్య లక్షా 72 వేలకు పడిపోయింది. ఇదే సమయంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు దాదాపు 18 శాతం నుంచి 11 శాతానికి చేరింది. దీంతో దేశంలో థర్డ్‌వేవ్‌ ప్రభావం గరిష్ఠ స్థితి దాటినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే విధంగా ఉంటే వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లేనని అభిప్రాయపడుతున్నారు.

కొన్ని రాష్ట్రాల్లోనే అధిక ప్రభావం..

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కేవలం కేరళ, మిజోరాం రాష్ట్రాల్లో మాత్రం వైరస్‌ ప్రభావం పెరుగుతోంది. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో కొవిడ్‌ క్రియాశీల కేసుల సంఖ్య 50 వేలకు పైనే ఉండగా.. 12 రాష్ట్రాల్లో 10 వేల నుంచి 50వేల మధ్యలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇలా దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలను సడలించాయి. ఇప్పటికే 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. మరో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాక్షికంగా తెరుచుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. వీటితోపాటు ఇతర రంగాలపై ఉన్న ఆంక్షలను కూడా ఆయా రాష్ట్రాలు క్రమంగా ఎత్తివేసే పనిలో నిమగ్నమయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని