శునకాలను పెంచుకుంటే పన్ను.. మధ్యప్రదేశ్ సిటీ కొత్త రూల్‌..!

పెంపుడు శునకాలపై పన్నులు విధించాలని మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ నగరం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ కొత్త రూల్‌ అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది.

Published : 14 Jan 2023 01:27 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని సాగర్‌ నగరం కొత్త చట్టం తీసుకురాబోతోంది. శునకాలను పెంచుకునేవారిపై పన్నులు విధించనుంది. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ తరహా పన్నులు విధించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

తాజాగా సాగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ సమావేశంలో శునకాల (Pet Dogs)ను పెంచుకునే యజమానులకు పన్ను (Tax) విధించడంపై నిర్ణయం తీసుకున్నారు. 48 మంది కౌన్సిలర్లు దీన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై విధివిధానాలను రూపొందించనున్నట్లు సాగర్‌ (Sagar City) మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ శుక్లా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

‘‘నగరంలో కుక్కల (Dogs) దాడి ఘటనలు పెరుగుతున్నాయి. అంతేగాక, బహిరంగ ప్రదేశాల్లోకి పెంపుడు శునకాలను తీసుకొచ్చి మలమూత్ర విసర్జన చేయించడం వల్ల పరిసరాలు అపరిశుభ్రం అవుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. శునకాలకు రిజిస్ట్రేషన్‌, వ్యాక్సినేషన్‌, కుక్కలను పెంచుకునేవారికి పన్నులు విధించాలని నిర్ణయించాం. ఆదాయం కోసం ఈ పన్నులు విధించట్లేదు. ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని శుక్లా వివరించారు.

అయితే, ఈ నిర్ణయాన్ని నగర వాసులు, జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పుడు నిర్ణయమని, వీధి శునకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలే తప్ప.. పెంపుడు శునకాలపై పన్నులు విధించడం ఏ మాత్రం సరికాదని వారు విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని