Domestic Airlines: దేశీయ విమానయానం.. 20 నెలల తర్వాత కోటి మార్కు

కరోనా ప్రభావం విమానయాన రంగంపైనా పడిన విషయం తెలిసిందే! అయితే, భారత్‌లో కొన్నాళ్లుగా పరిస్థితులు కుదుటపడటంతో దేశీయ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ విమానయాన సంస్థలు ఈ ఏడాది జనవరి- నవంబర్ మధ్య మొత్తం 7.26 కోట్ల...

Published : 18 Dec 2021 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ప్రభావం విమానయాన రంగంపైనా పడిన విషయం తెలిసిందే! అయితే, భారత్‌లో కొన్నాళ్లుగా పరిస్థితులు కుదుటపడటంతో దేశీయ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ విమానయాన సంస్థలు ఈ ఏడాది జనవరి- నవంబర్ మధ్య మొత్తం 7.26 కోట్ల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే కాలంలో 5.56 కోట్ల మంది ప్రయాణించారు. తద్వారా వార్షిక వృద్ధి రేటు 30.40 శాతంగా నమోదైనట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) తాజా గణాంకాల్లో వెల్లడైంది. కరోనాకు ముందు గతేడాది ఫిబ్రవరిలో 1.23 కోట్ల మంది ప్రయాణించగా.. 20 నెలల తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో ఈ సంఖ్య కోటి దాటింది.

గతేడాది నవంబరులో 63.54 లక్షల మంది ప్రయాణించగా.. ఈ ఏడాది నవంబరులో కోటి దాటారు. దాదాపు 64 శాతం వృద్ధి కనిపించినట్లు ఐసీఆర్‌ఏ ఒక ప్రకటనలో తెలిపింది. 2020లో లాక్‌డౌన్‌ అనంతరం దేశీయ విమాన సేవలను పునఃప్రారంభించాక.. జూన్‌లో ప్రయాణికుల సంఖ్య 19.84 లక్షలుగా నమోదైంది. ఈ ఏడాది మార్చి వరకు క్రమంగా పుంజుకున్నా.. రెండో వేవ్‌ కారణంగా మరోసారి పడిపోయింది. మేలో 21.15 లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగించారు. ఎట్టకేలకు నవంబరులో కోటి దాటింది. నెలవారీ వృద్ధీ 15-16 శాతంగా నమోదైంది. మరోవైపు ఒమిక్రాన్‌ కలవరం నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభాన్ని కేంద్రం ఇటీవల వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని