Choksi: భారత్‌ పేరు వింటే బీపీ పెరుగుతోంది 

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లే కన్పిస్తోంది. ఛోక్సీ ‘అప్పగింత’పై

Updated : 15 Jun 2021 14:54 IST

‘మానసిక ఒత్తిడి’ అంటూ కోర్టుకు రాని ఛోక్సీ

డొమినికా: పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లే కన్పిస్తోంది. ఛోక్సీ ‘అప్పగింత’పై డొమినికా న్యాయస్థానం సోమవారం విచారణ జరపాల్సి ఉండగా.. అనారోగ్యంగా ఉందంటూ ఆయన అసలు కోర్టుకే రాలేదు. దీంతో విచారణ వాయిదా పడింది.

మే 23న ఛోక్సీ డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించారంటూ అక్కడి పోలీసులు నమోదు చేసిన కేసుపై న్యాయస్థానం నిన్న విచారణ జరపాల్సి ఉంది. అయితే నిన్న ఆయన కోర్టుకు రాలేదని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘మానసిక ఒత్తిడి’ కారణంగా ఛోక్సీ బీపీ పెరిగిందని అందుకే ఆయన రాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ మేరకు ఛోక్సీకి చికిత్స అందిస్తున్న డొమినికా చైనా ఫ్రెండ్‌షిప్‌ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన వైద్య నివేదికను కోర్టుకు అందజేశారు.

దీంతో ఈ కేసులో విచారణను న్యాయస్థానం జూన్‌ 25వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా ఛోక్సీని పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రిలోనే ఉంచాలని ఆదేశించింది. అయితే తదుపరి రిమాండ్‌ కోసం జూన్‌ 17న ఛోక్సీని కోర్టు ఎదుట హాజరుపర్చాలని స్పష్టం చేసింది. దీంతో ఛోక్సీ అప్పగింతపై విచారణ మరింత జాప్యం అవుతోంది. అయితే భారత్‌కు వెళ్లకుండా ఉండేందుకే ఛోక్సీ బృందం ఈ వ్యూహాలు అమలు చేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

‘కిడ్నాప్‌’పై సాక్ష్యాలున్నాయి..

మరోవైపు ఛోక్సీని బలవంతంగా ఆంటిగ్వా నుంచి డొమినికా తీసుకొచ్చారని మొదట్నుంచీ ఆరోపిస్తున్న ఆయన న్యాయవాదులు.. దీనిపై తమవద్ద సాక్షాలున్నాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను డొమినికాలోని ఆయన న్యాయవాది మైఖెల్‌ పొలాక్‌ విడుదల చేశారు. మొదట ఛోక్సీని చిన్న బోటులో ఎక్కించారని, అక్కడ ఆయనపై దాడి చేసి తర్వాత పెద్ద బోటులో ఎక్కించి డొమినికా తీసుకొచ్చారని మైఖెల్‌ ఆరోపించారు.

పీఎన్‌బీ బ్యాంకును రూ.13,500కోట్లకు మోసగించిన కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్‌ మోదీ ప్రధాన నిందితులు. అయితే ఈ కుంభకోణం బయటకు రావడానికి ముందే భారత్‌ నుంచి పారిపోయిన ఛోక్సీ.. ఆంటిగ్వా పౌరసత్వం ఉండటంతో 2018 నుంచి అక్కడే ఉంటున్నారు. కాగా.. గత నెల 23న ఉన్నట్టుండి అదృశ్యమైన ఛోక్సీ.. ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కాడు. భారత్‌కు అప్పగించేందుకు ఛోక్సీని కిడ్నాప్‌ చేసి డొమినికా తీసుకెళ్లారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అయితే, ఛోక్సీ క్యూబా పారిపోతూ అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించడంతో పట్టుకున్నామని డొమినికా అధికారులు తెలిపారు. డొమినికా కోర్టులో ఛోక్సీపై రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఇటీవల ఆయన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. పారిపోయే అవకాశం ఉన్నందున ఛోక్సీ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని