Mehul Choksi: కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. గత ఆదివారం ఆంటిగ్వాలో కన్పించకుండా

Updated : 28 May 2021 10:20 IST

ఆరోపించిన ఛోక్సీ లాయర్.. భారత్‌కు అప్పగింతపై స్టే

డొమినికా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. గత ఆదివారం ఆంటిగ్వాలో కన్పించకుండా పోయిన ఆయన రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికా దీవిలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేసి డొమినికా తీసుకెళ్లారని ఛోక్సీ చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది ఆరోపించారు. ఈ మేరకు డొమినికా కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఛోక్సీని భారత్‌కు అప్పగించడంపై అక్కడి న్యాయస్థానం స్టే విధించింది. 

డొమినికా పోలీసుల అదుపులో ఉన్న ఛోక్సిని ఆయన న్యాయవాదుల బృందం కలిసేందుకు అనుమతినివ్వలేదు. అయితే చాలా సార్లు ప్రయత్నించిన తర్వాత వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అంగీకరించినట్లు డొమినికాలోని ఆయన లాయర్‌ వేన్‌ మార్ష్‌ తెలిపారు. ‘‘ఛోక్సీని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆయనను తీవ్రంగా కొట్టినట్లు అన్పిస్తోంది. కళ్లు ఉబ్బిపోయాయి. ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయి. ఆంటిగ్వాలోని జాలీ హార్బర్‌ వద్ద నుంచి కొంతమంది వ్యక్తులు తనను బలవంతంగా లాక్కొని ఓ బోటులో డొమినికా తీసుకొచ్చారని ఆయన నాతో చెప్పారు. వారు భారత్‌, ఆంటిగ్వా పోలీసులు అయి ఉంటారని ఆయన అన్నారు’’ అని మార్ష్‌ చెప్పుకొచ్చారు. 

ఆంటిగ్వాలో ఛోక్సీ ఉన్నట్టుండి అదృశ్యమవడం, డొమినికా పోలీసులు అరెస్టు చేయడం అనుమానాస్పదంగా ఉందని ఆయన లీగల్‌ టీం ఆరోపించింది. భారత్‌కు రప్పించేందుకు కావాలనే ఆయనను డొమినికా తీసుకెళ్లి ఉంటారని లాయర్లు అన్నారు. అయితే ఆయనకు భారత్‌ పౌరసత్వం లేదని, అలాంటప్పుడు ఆ దేశానికి ఎలా అప్పగిస్తారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అప్పగింతపై స్టే విధించింది. తదుపరి విచారణను డొమినికా కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం విచారించనున్నట్లు తెలుస్తోంది. 

ఇంకా భారతీయుడేనా.. 

అయితే భారత్‌లో పౌరసత్వాన్ని రద్దు చేసుకునేందుకు ఛోక్సీ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఆయన ఇంకా భారతీయుడేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఛోక్సీ అప్పగింతపై తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని పేర్కొంటున్నాయి. 

గత ఆదివారం సాయంత్రం ఛోక్సీ ఆంటిగ్వాలో అదృశ్యమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఇంటర్‌పోల్‌ ఎల్లో నోటీసులు జారీ చేసింది. అయితే రెండు రోజుల తర్వాత ఆంటిగ్వా పక్కనే ఉన్న డొమినికాలో ఓ బీచ్‌లో పత్రాలు విసిరేస్తూ కన్పించిన ఛోక్సీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఛోక్సీని తిరిగి తమ దేశానికి పంపొద్దని, అటు నుంచే అటే భారత్‌కు అప్పగించమని ఆంటిగ్వా ప్రధాని కోరారు. పీఎన్‌బీ కేసులో ఛోక్సీలో రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ అవడంతో ఆయనను డొమినికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించే వీలున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని