Trump: చైనాను సొమ్ము కట్టమనండి..!

కొవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 06 Jun 2021 15:20 IST

 ప్రపంచ దేశాలకు ట్రంప్‌ పిలుపు

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఉత్తర కరోలినాలోని రిపబ్లికన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మాట్లాడుతూ‘‘అమెరికా, మిగిలిన ప్రపంచానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది.  వారు చైనాను పరిహారం కోరాలి. కరోనా మహమ్మారికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా బాధ్యత స్వీకరించాలి. పరిణామాలను చైనా అనుభవించాలని ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో చెప్పాలి. అన్ని దేశాలు కలిసి పనిచేసి చైనాకు కనీసం 10 ట్రిలియన్‌ డాలర్లకు తక్కువ కాకుండా పరిహారం చెల్లించాలని బిల్లు ఇవ్వాలి. వారు చేసిన నష్టానికి అది కూడా చాలా తక్కువ. ఇప్పటికే చైనా నుంచి తీసుకొన్న అప్పుల చెల్లింపును నిలిపివేయాలి. దానిని తొలి విడత పరిహారం చెల్లింపుగా భావించాలి. ప్రపంచ దేశాలు చైనాకు డబ్బులు చెల్లించకూడదు. అది చాలా దేశాలను ఆర్థికంగా సర్వనాశనం చేసింది. అలాంటి దేశాలకు చైనా డబ్బు చెల్లించాలి’’ అని అన్నారు.

‘‘జోబైడెన్‌ కుటుంబం చైనా కమ్యూనిస్టు పార్టీ దగ్గర మిలియన్ల కొద్ది డాలర్లు తీసుకొని అమెరికా ప్రజలకు అబద్ధాలు చెప్పింది. పెద్ద టెక్‌ కంపెనీలు, అమెరికాలోని ఫేక్‌ మీడియా దీని గురించి పట్టించుకోదు. ఇక డాక్టర్‌ ఫౌచీ వైరస్‌ వ్యాపిస్తున్న తొలినాళ్లలో మాస్కులు పెట్టుకోవద్దని చెప్పారు. గుర్తుకు తెచ్చుకోండి. ఆ తర్వాత మాస్కులు పెట్టుకోవాలన్నారు. చివరికి ఆయనే పెద్ద ‘మాస్కర్‌’ అయ్యారు. వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంలో ఫౌచీ జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశారు’’ అని ట్రంప్‌ మండిపడ్డారు.

అమెరికా తక్షణమే చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100శాతం టారీఫ్‌లు విధించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడే వారి సైన్యం వెనక్కి తగ్గడంతోపాటు అమెరికా కంపెనీలు స్వదేశానికి వస్తాయని పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాప్తికి ముందు వరకు చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ను చైనా లక్ష్యపెట్టదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని