Bilkis Bano: ఆ దోషుల విడుదల ప్రభుత్వ నిర్ణయమే.. న్యాయవ్యవస్థను నిందించొద్దు..!

బిల్కిస్‌ బానో (Bilkis Bano) సామూహిక అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న దోషులను జైలు నుంచి విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా

Published : 19 Aug 2022 17:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిల్కిస్‌ బానో (Bilkis Bano) సామూహిక అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న దోషులను జైలు నుంచి విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాగైతే సామాన్యులకు న్యాయం ఎలా దక్కుతుందంటూ న్యాయవ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్కిస్‌ బానో కేసులో దోషులకు శిక్ష విధించిన న్యాయమూర్తి జస్టిస్‌ మృదులా భట్కర్‌ స్పందించారు. అత్యాచార దోషులను విడుదల చేయడం పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమే అని, ఇందుకు న్యాయవ్యవస్థను నిందించొద్దని కోరారు.

‘‘ఈ విషయంలో ప్రజలు న్యాయవ్యవస్థను ఎందుకు తప్పుబడుతున్నారో అర్థం కావట్లేదు. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ప్రజల హక్కులను పరిరక్షించేందుకు న్యాయవ్యవస్థ శాయశక్తులా ప్రయత్నిస్తుంటుంది. బిల్కిస్‌ బానో కేసులోనూ మేం అదే చేశాం. సెషన్స్‌ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకూ మేమంతా ప్రజలకు న్యాయం దక్కేందుకే పనిచేస్తాం. కానీ, ఈ రోజు మమ్మల్ని విమర్శించడం బాధ కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మమ్మల్ని మేమే రక్షించుకోలేకపోతున్నాం’’ అని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో బిల్కిస్‌ బానో కేసులో 11 మందికి జీవిత ఖైదు విధించిన డివిజన్‌ బెంచ్‌లో జస్టిస్‌ మృదుల భట్కర్‌ ఒకరు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యూనల్‌కు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మందికి జీవితఖైదు పడింది. వీరంతా 15 ఏళ్లు జైలుశిక్ష అనుభవించారు. ఇటీవల ఈ దోషుల్లో ఓ వ్యక్తి తనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్‌ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు వారి విడుదలకు ప్రభుత్వం ఆదేశించడంతో ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, అత్యాచార దోషులను ప్రభుత్వమే విడుదల చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని