Third wave: మూడో దశపై భయాలు సృష్టించొద్దు! 

కరోనా థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, భయపడకుండా ఉండటమే దీనికి.........

Updated : 28 Jun 2021 18:13 IST

దిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, భయపడకుండా ఉండటమే దీనికి మంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. దిల్లీలో ప్రజారోగ్యంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో వైద్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించడంతోనే థర్డ్‌వేవ్‌ ముప్పు నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ‘‘వైద్యులకు నాదో చిన్న విన్నపం. థర్డ్‌వేవ్‌పై భయాందోళనలు సృష్టించవద్దు. ఎందుకంటే దీనికి ప్రాథమిక సూత్రం ముందు జాగ్రత్తే గాని భయాందోళనకు గురికావడం కాదు’’ అని సూచించారు. థర్డ్‌వేవ్‌ గురించి మాట్లాడేందుకు బదులుగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సెకండ్‌ వేవ్‌పై పోరాడేందుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్యరంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం మరింత బలోపేతమైందని తెలిపారు. 

ఈ సదస్సులో దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మాట్లాడుతూ..  థర్డ్‌ వేవ్‌ అవకాశాలపై సన్నద్ధమవుతుండటం, డెల్టా ప్లస్‌ వంటి వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజారోగ్య వ్యవస్థను ఎలా బలోపేతం చేసుకోవాలనే అంశంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. బలమైన ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటు ఆవశ్యకతను కొవిడ్‌ సూచించిందన్నారు. వైద్య రంగంలో నిధులు పెంచడం, టెక్నాలజీ వినియోగం, వైద్య సిబ్బంది, రోగుల నిష్పత్తిని దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులను పెంచడంపై దృష్టిసారించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని