Adhir Ranjan: కావాలంటే నన్ను ఉరితీయండి.. మేడమ్‌ని మాత్రం అందులోకి లాగొద్దు!

రాష్ట్రపతిపై కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరీ చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారానికి దారితీసింది. రంజన్‌ వ్యాఖ్యలపై అధికార భాజపా తీవ్రంగా మండిపడింది. ప్రథమ పౌరురాలిని అగౌరపర్చినందుకు గానూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా

Updated : 28 Jul 2022 17:32 IST

దిల్లీ: రాష్ట్రపతిపై కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరీ చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారానికి దారితీసింది. రంజన్‌ వ్యాఖ్యలపై అధికార భాజపా తీవ్రంగా మండిపడింది. ప్రథమ పౌరురాలిని అగౌరపర్చినందుకు గానూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలంటూ కాషాయ పార్టీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా వివాదంపై అధిర్‌ రంజన్‌ స్పందించారు. తాను క్షమాపణ చెబుతానని, ఈ వివాదంలోకి సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.

ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ముపై అధిర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్య తీవ్ర వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీనిపై భాజపా మండిపడటంతో ఆయన వెంటనే క్షమాపణలు తెలియజేశారు. తాను పొరబాటుగా నోరు జారానంటూ ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు. అయితే దీనిపై పార్లమెంట్ నేడు దద్దరిల్లింది. అత్యున్నత పదవిలో ఉన్న మహిళను కాంగ్రెస్‌ అవమానించిందని, ఇందుకు సోనియా క్షమాపణలు చెప్పాలని భాజపా ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో దీనిపై మరోసారి స్పందించిన అధిర్‌.. ‘‘రాష్ట్రపతిని అవమానించే ఉద్దేశం నాకు లేదు. అది పొరబాటుగా జరిగింది. పూర్తిగా నా తప్పే. ఒకవేళ రాష్ట్రపతి అవమానకరంగా భావిస్తే నేరుగా వెళ్లి క్షమాపణలు చెబుతాను. నేను చేసిన పొరబాటుకు కావాలంటే నన్ను ఉరితీయండి. శిక్షను ఎదుర్కోడానికి నేను సిద్ధమే. అంతేగానీ, ఈ వివాదంలోకి మేడమ్‌(సోనియా గాంధీ)ను ఎందుకు లాగుతున్నారు?’’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని