మనస్తాపంతో వైద్యురాలి ఆత్మహత్య.. ఆందోళనకు దిగిన వైద్యులు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఓ వైద్యురాలు గర్భిణికి చికిత్స చేస్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదవడంతో ఆ వైద్యురాలు ప్రాణాలు తీసుకున్నారు......

Published : 31 Mar 2022 01:33 IST

జైపుర్‌: గర్భిణికి చికిత్స చేస్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. గైనకాలజిస్ట్​ నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందంటూ పోలీస్​స్టేషన్​లో ఐపీసీ సెక్షన్​ 302 కింద కేసు నమోదైంది. దీంతో మనస్తాపం చెందిన ఆ వైద్యురాలు తన ప్రాణాలు తీసుకున్నారు. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల సమాచారం ప్రకారం.. డా.అర్చనా శర్మ, ఆమె భర్త కలిసి లాల్​సోట్​లో ఓ ప్రైవేట్​ ఆసుపత్రి నడుపుతున్నారు. సిజేరియన్​ చేస్తుండగా ఓ గర్భిణి సోమవారం మృతిచెందింది. అయితే వైద్యురాలి నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆమెపై చర్యకు డిమాండ్​ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన వైద్యురాలు ఆస్పత్రిపైనే ఉన్న తన నివాసంలో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య​కు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో సూసైడ్​ నోట్​ లభ్యమైంది. తాను నిర్దోషినని చెప్పడానికి చావే సాక్ష్యం అని, అమాయక డాక్టర్లను వేధించడం మానుకోవాలని అందులో పేర్కొన్నారు.

పోలీసులపై చర్యలు చేపట్టాలి

ఈ ఘటన జిల్లావ్యాప్తంగా ఉన్న వైద్యులను ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఇందుకు నిరసనగా బుధవారం వైద్య సేవలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని డిమాండ్​ చేశారు. వృత్తిపరమైన విధుల్లో ఉన్నప్పుడు వైద్యులపై సెక్షన్​ 302 కింద కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో ఉందని ప్రైవేట్​ హాస్పిటల్స్​ అండ్​ నర్సింగ్​ హోమ్స్​ సొసైటీ సెక్రటరీ డా.విజయ్​ కపూర్​ అన్నారు. ఈ ఘటనలో వైద్యురాలు సహా ఆమె కుటుంబసభ్యులు తీవ్రవేదనకు గురయ్యారని, అందుకే ఆమె కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బాధ్యులైన పోలీసు అధికారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. న్యాయం జరిగేవరకు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు.

కేసులో సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని డివిజనల్​ కమిషనర్​ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ విచారం వ్యక్తం చేశారు. నిందితులను విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ‘డాక్టర్​ అర్చనా శర్మ ఆత్మహత్య విచారకరం. రోగుల ప్రాణాలను కాపాడటం కోసం డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు వారిని నిందించడం సమంజసం కాదు’ అని గహ్లోత్​ ట్వీట్​ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని