CRPF: బాబుల్‌ సుప్రియో భద్రతా వివాదం.. ఎటెళ్తున్నారో చెప్పడం లేదన్న సీఆర్‌పీఎఫ్‌

‘వై కేటగిరీ’ భద్రత విషయంలో మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియోకు, కేంద్రానికి మధ్య వివాదం నెలకొంది. దీనికి సీఆర్‌పీఎఫ్‌ కేంద్రంగా మారింది. సెప్టెంబరులో భాజపాను వీడి టీఎంసీలో చేరిన అనంతరం సుప్రియో స్వీయ విజ్ఞప్తి మేరకు.. కేంద్ర హోంశాఖ ఆయన సాయుధ...

Published : 16 Dec 2021 16:17 IST

కోల్‌కతా: ‘వై కేటగిరీ’ భద్రత విషయంలో మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియోకు, కేంద్రానికి మధ్య వివాదం నెలకొంది. దీనికి సీఆర్‌పీఎఫ్‌ కేంద్రంగా మారింది. సెప్టెంబరులో భాజపాను వీడి టీఎంసీలో చేరిన అనంతరం సుప్రియో స్వీయ విజ్ఞప్తి మేరకు.. కేంద్ర హోంశాఖ ఆయన సాయుధ భద్రతను జడ్‌ కేటగిరీ నుంచి వై కేటగిరీకి తగ్గించింది. అయితే, ప్రస్తుతం తనకు కేంద్రం నుంచి ఎలాంటి భద్రత లేదని సుప్రియో తాజాగా ఓ వార్తాసంస్థకు వెల్లడించడం చర్చనీయాంశమైంది. ఇకముందూ అవసరం లేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం వై కేటగిరీని తాను వినియోగించుకోవడం లేదని సుప్రియో చెప్పారు. సెప్టెంబరు నుంచి తన ప్రయాణ వివరాలను కేంద్ర భద్రతా సిబ్బందితో పంచుకోలేదని, వారూ అడగలేదని తెలిపారు. గతంలోనూ తనకు రక్షణ కల్పించింది సీఐఎస్‌ఎఫ్ అని, సీఆర్‌పీఎఫ్ కాదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తోందన్నారు.

‘భద్రత కవరేజీ యాక్టివ్‌గానే ఉంది..’

ఈ విషయంపై కేంద్ర హోం శాఖ, సీఆర్‌పీఎఫ్‌లు స్పందిస్తూ.. సుప్రియోకు భద్రతా కవరేజీ ఇంకా యాక్టివ్‌గానే ఉందని చెప్పాయి. పైగా.. ఈ సెక్యూరిటీ అనేది వ్యక్తిగత విజ్ఞప్తితో ఇవ్వరని, ముప్పు ఏ మేర ఉందనే నివేదికల ఆధారంగా ఇస్తారని ఓ అధికారి వెల్లడించారు. ‘హోం శాఖ ఆదేశాల మేరకు సుప్రియోకు భద్రత కల్పించడం మా విధి. కానీ.. ఆయన తన ప్రయాణ వివరాలు పంచుకోవడం లేదు. ఈ విషయాన్ని ఆయన దృష్టికీ తీసుకెళ్లాం’ అని సీఆర్‌పీఎఫ్ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని