TamilNadu: ఉత్తరాది కార్మికులకు పూర్తి రక్షణ : తమిళనాడు గవర్నర్‌

ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని తమిళనాడు (Tamil Nadu) గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి స్పష్టం చేశారు. బిహార్‌ (Bihar) నుంచి వచ్చిన వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.

Updated : 05 Mar 2023 14:56 IST

చెన్నై: ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మిలకులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్‌ మీడియాలో (Social Media) వదంతులు రావడం తమిళనాడులో కలకలం రేపింది. దీంతో బిహార్‌ (Bihar) వంటి రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసుకునే కార్మికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇటువంటి వదంతులపై స్పందించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (Stalin) కూడా బిహార్‌ ముఖ్యమంత్రితో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారని.. స్నేహపూర్వకంగా ఉంటారంటూ తమిళనాడు గవర్నర్‌ (Governor) ఆర్‌ఎన్‌ రవి ఉత్తరాది కార్మికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు ఎటువంటి భయాందోళనలు, అభద్రతాభావనకు గురికావద్దు. తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారు. స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తులు. వారికి పూర్తి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు’ అని తమిళనాడు రాజ్‌భవన్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో ఓ ప్రకటన చేసింది.

బిహారీలు సహా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వైరలైన వీడియోలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు బిహార్‌ సీఎం ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. తమ రాష్ట్ర కార్మికుల భద్రతకు సర్కారు భరోసా కల్పించాలని కోరారు. వైరల్‌ వీడియోల్లోని దృశ్యాలు తమ రాష్ట్రంలోనివి కావని స్టాలిన్‌ స్పష్టం చేశారు. వీడియోల వ్యవహారంపై కార్మిక సంక్షేమశాఖ మంత్రి, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో వదంతులు సృష్టించిన ఇద్దరు హిందీ పత్రికల జర్నలిస్టులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం కూడా వలస కార్మికుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని.. అదే సమయంలో ఇక్కడి కంపెనీల్లో రాష్ట్రానికి చెందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని