Mamata Banerjee: అవినీతికి నేను వ్యతిరేకం.. మంత్రి అరెస్టు నేపథ్యంలో దీదీ వ్యాఖ్యలు

ఉపాధ్యాయుల నియామక కుంభకోణం కేసులో తమ పార్టీ మంత్రి అరెస్టయిన నేపథ్యంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు........

Published : 25 Jul 2022 22:35 IST

కోల్‌కతా: ఉపాధ్యాయుల నియామక కుంభకోణం కేసులో తమ పార్టీ మంత్రి అరెస్టయిన నేపథ్యంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతికి (Corruption) తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. ‘‘అవినీతి, ఇతర చెడు పనులకు నేను వ్యతిరేకిని’’ అని అన్నారు. అయితే అరెస్టయిన పార్థా ఛటర్జీ (Partha Chatterjee) గురించి మాత్రం ఆమె ప్రత్యక్షంగా మాట్లాడలేదు. అయితే, పార్థా ఛటర్జీకి టీఎంసీ దూరంగా ఉండనున్నట్లు సీఎం తాజా వ్యాఖ్యలు తేటతెల్లం చేశాయి. ‘‘ఏజెన్సీలను ఉపయోగించుకొని టీఎంసీని విచ్ఛిన్నం చేయగమని భాజపా భావిస్తే అది పొరపాటే’’ అని దీదీ అన్నారు.

అరెస్టయిన తర్వాత మమతకు ఛటర్జీ మూడుసార్లు ఫోన్‌ చేసినట్లు వస్తున్న వార్తలను టీఎంసీ ఖండించింది. అరెస్టు సమయంలో ఆయన ఫోన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల వద్ద ఉంటుందని, దీదీకి ఆయన ఫోన్‌ చేసే ప్రసక్తే లేదని పార్టీ నేత ఫిర్హాద్‌ హకీమ్‌ స్పష్టం చేశారు. తప్పుచేసిన వారు ఎంత పెద్ద నేత అయినా తమ పార్టీ రాజకీయంగా జోక్యం చేసుకోబోదని టీఎంసీ ఆదివారం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను ఈడీ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని డిమాండ్‌ చేసింది.

జులై 22న బెంగాల్‌లోని పలుచోట్ల సోదాలు జరిపిన ఈడీ అధికారులు మంత్రి ఛటర్జీ అనుచరురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో శుక్రవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. అనంతరం ఛటర్జీని ఈడీ అరెస్టు చేయడం కలకలం రేపింది. పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని