Biplab Deb: కోర్టు ధిక్కారానికి భయపడకుండా పనిచేయాలి: త్రిపుర సీఎం

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కారానికి భయపడకుండా పనిచేయాలని అధికారులకు ఆయన సూచించారు

Published : 28 Sep 2021 01:28 IST

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బిప్లబ్‌ దేవ్‌

అగర్తాల: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కారానికి భయపడకుండా పనిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. అగర్తాలలో జరిగిన త్రిపుర సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ 26 వ ద్వైవార్షిక సమావేశం రవీంద్ర శతాబర్షికి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా బిప్లబ్‌ దేవ్‌ అధికారులతో మాట్లాడుతూ.. ‘‘మన వ్యవస్థలో ఒక నిర్దిష్ట పనిని చేయలేకపోతున్నామని చాలా మంది అధికారులు చెప్పారు. ఏం చేసినా కోర్టు ధిక్కరణ అవుతుందేమో అని భయపడుతున్నారు. అలా ఎందుకు భయపడాలి? కోర్టు ధిక్కారానికి త్రిపురలో ఎవరు జైలుకు వెళ్లారు? నేను ఇక్కడే ఉన్నాను. మీరు జైలుకెళ్లితే మీకంటే ముందు నేను వెళ్తాను. మిమ్మల్ని జైల్లో పెట్టడం అంత సులభం కాదు. జైలుకు తీసుకెళ్లేది పోలీసులే. వారు నా నియంత్రణలో ఉండి పనిచేస్తారు’’ అని పేర్కొన్నారు.

‘‘ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిగా నాకు అధికారం ఉంటుంది. కోర్టు ధిక్కారం అవుతుందని చెప్పినా కేబినేట్‌లో పదోన్నతుల నిర్ణయం తీసుకున్నాం. కోర్టు ధిక్కారానికి భయపడి గత ప్రభుత్వంలో పనిచేసిన చీఫ్‌ సెక్రటరీ ఇది సాధ్యం కాదన్నారు. పదవీ విరమణ వరకూ పదోన్నతులు ఇవ్వకుండా కూర్చోబెట్టడం అన్యాయం చేయడమే. కానీ అది కోర్టు ధిక్కారం అవుతుందని చెప్పారు. అయినా మేము నిర్ణయం తీసుకున్నాం. అధికారంలో ఉన్న ప్రభుత్వం నిబంధనలపై నిర్ణయం తీసుకుంటుంది. మాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. కోర్టు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు. ప్రజల కోసమే కోర్టు ఉంది. కోర్టుల కోసం ప్రజలు ఉండరు. ప్రజల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాం’’అని బిప్లబ్‌ దేవ్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా బిప్లబ్‌ దేవ్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను సీఎం అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని