ఇంటింటికీ టీకా సాధ్యం కాదు: కేంద్రం  

ఇంటింటికీ టీకా పంపిణీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ కలుషితం, వృథా సహా పలు కారణాలతో ఈ సదుపాయం కల్పించలేకపోతున్నట్టు బాంబే హైకోర్టుకు ....

Published : 21 Apr 2021 21:11 IST

ముంబయి: ఇంటింటికీ టీకా పంపిణీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ కలుషితం, వృథా సహా పలు కారణాలతో ఈ సదుపాయం కల్పించలేకపోతున్నట్టు బాంబే హైకోర్టుకు తెలిపింది. 75 ఏళ్లు పైబడిన వారికి, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఇంటికే వెళ్లి టీకా వేయాలని కోరుతూ ముంబయికి చెందిన న్యాయవాదులు ధృతి కపాడియా, కునాల్‌ తివారీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సమాధానంగా కేంద్రం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇంటికి వెళ్లి టీకా వేసే సదుపాయం ఎందుకు కల్పించలేకపోతున్నారో కారణాలను వివరిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అండర్‌ సెక్రటరీ సత్యేంద్ర సింగ్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.

ఇమ్యునైజేషన్‌ సందర్భంలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తితే కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని, అలాగే,  టీకా పంపిణీ కార్యక్రమంలో కూడా ఆలస్యం జరుగుతుందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ తర్వాత 30నిమిషాల పాటు రోగిని పరిశీలనలో ఉంచాలన్న ప్రోటోకాల్‌ని అమలుచేయడం కూడా ఓ సవాల్‌గా మారుతుందన్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడం వల్ల వ్యాక్సిన్‌ కలుషితం అయ్యే అవకాశం ఉంటుందని, ప్రతి ఇంటికీ వ్యాక్సిన్‌ కంటైనర్‌ను తీసుకెళ్లడం వల్ల దాని సమర్థతపైనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దాంతోపాటు టీకా పంపిణీలో ఆలస్యం జరిగితే పెద్ద ఎత్తున టీకా వృథా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనలను ప్రత్యేకంగా పరిగణించి సీనియర్‌ సిటిజన్ల కోసం మరిన్ని టీకా కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపినట్టు చెప్పారు. బాంబే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా,  జస్టిస్‌ జీఎస్‌ కులకర్ణితో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై గురువారం విచారణ జరిపే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని