QR Code: సమాధిపై QR కోడ్‌.. కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!

QR code on tomb: కొడుకు జ్ఞాపకాలను పదిలంగా ఉంచేందుకు ఓ తండ్రి కొత్త ఆలోచన చేశాడు. సమాధిపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించాడు.

Published : 22 Mar 2023 21:56 IST

QR code on tomb: త్రిస్సూర్‌ (కేరళ): కళ్ల ముందే ఎదిగిన కుమారుడు దూరమైతే ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం. కని పెంచిన చేతులను ఆ బాధ ఏళ్ల పాటు వెంటాడుతుంటుంది. అలాంటి కుమారుడి జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఉండేందుకు ఓ తండ్రి కొత్త ఆలోచన చేశాడు. కుమారుడి సమాధిపై క్యూఆర్‌ కోడ్‌  (QR Code) ముద్రించాడు. అందులో అతడి జ్ఞాపకాలను పదిలిపరిచాడు. తన కుమారుడిని గుర్తు చేసుకునేందుకు సమాధి వద్ద ఈ ఏర్పాటు చేశాడు.

కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన ఫ్రాన్సిస్‌ కుమారుడు డాక్టర్‌ ఇవిన్‌ ఫ్రాన్సిస్‌ (26) ఒమన్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. 2021లో బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఒక్కసారిగా నేలకొరిగాడు. చిన్న వయసులోనే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. చిన్నప్పటి నుంచే మ్యూజిక్‌, స్పోర్ట్స్‌లో ముందుండే ఇవిన్‌.. చదువుతో పాటు వాటికీ అంతే ప్రాధాన్యం ఇచ్చేవాడు. తన ప్రదర్శనలతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. అలాంటి తన కుమారుడి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలన్న ఆకాంక్షతోనే సమాధిపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించినట్లు ఫ్రాన్సిస్‌ తెలిపారు.

‘‘క్యూఆర్‌ కోడ్‌ ఆలోచన ఇవిన్‌దే. ఏదైనా సమాచారాన్ని నాకు క్యూఆర్‌ కోడ్‌ల రూపంలోనే పంపేవాడు. అవి డౌన్‌లోడ్‌ చేసుకుని వాటిని స్కాన్‌ చేసి చదువుకునేవాడిని’’ అని ఫ్రాన్సిన్‌ చెప్పుకొచ్చారు. కుమారుడి గురించి చెప్పాలనుకున్నది కేవలం సమాధిపై రాస్తే సరిపోదని, ఇంకేదో చేయాలన్న భావన నుంచే ప్రొఫైల్‌ రూపొందించాలన్న ఆలోచన పురుడుపోసుకుందని వివరించారు. దాన్ని క్యూఆర్‌ కోడ్‌ రూపంలో సమాధిపై ఉంచాలని నిర్ణయించినట్లు ఫ్రాన్సిస్‌ పేర్కొన్నారు. ఇందుకోసం తన కుమార్తె కేవలం 10 రోజుల్లోనే ఓ వెబ్‌సైట్‌ను రూపొందించి క్యూఆర్‌ కోడ్‌ సిద్ధం చేసిందని తెలిపారు. దాన్ని మార్బుల్‌పై ప్రింట్‌ చేయించి.. స్థానిక సెయింట్‌ జోసెఫ్‌ చర్చి ప్రాంగణంలో సమాధి ఏర్పాటు చేశారు. తన కుమారుడి గురించి చెప్పాలంటే తామెవరూ సమాధి దగ్గర ఉండాల్సిన అవసరం లేదని, కేవలం స్కాన్‌ చేస్తే సమస్త సమాచారం అందులో దొరుకుతుందని చెప్పారు. ఇవిన్‌ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌లో ఫొటోలు, కాలేజీ సమయంలో పాల్గొన్న ప్రోగ్రాములతో పాటు కీబోర్డు, గిటార్‌తో అతడు ఇచ్చిన ప్రదర్శనల వీడియోలు కూడా కనిపిస్తాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని