అలా అయితే రైతుల ఆదాయాన్ని డబుల్‌ చేయలేం

 నూతన సాగు చట్టాల్ని వెంటనే అమలు చేయకపోతే 2020 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశమే లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ అభిప్రాయపడ్డారు. ఆందోళన చేస్తున్న రైతులు.........

Updated : 28 Mar 2021 14:53 IST

నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌

దిల్లీ: నూతన సాగు చట్టాల్ని వెంటనే అమలు చేయకపోతే 2020 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశమే లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ అభిప్రాయపడ్డారు. ఆందోళన చేస్తున్న రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. వెంటనే ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. అలాగే జన్యుమార్పిడి ద్వారా పండించిన పంటలన్నింటిపై నిషేధం విధించడం సరికాదని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. పంట రకం, దాని ప్రభావాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

అటు కేంద్రం, ఇటు రైతులు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు సాగితేనే సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుందని రమేశ్‌ అభిప్రాయపడ్డారు. ఏడాదిన్నర పాటు చట్టాల అమలు నిలిపివేసి ప్రభుత్వం ఇప్పటికే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. చట్టంలోని ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు సమయం చాలా ఉందని.. నిదానంగా నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. చట్టాల్లో చేయాల్సిన సవరణలను ప్రభుత్వం ముందుంచాలన్నారు. రైతులు ఇలాగే మొండిపట్టుతో ముందుకెళితే అది చివరకు వారినే దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. రానురాను ఇది రాజకీయపరమైన రంగు సంతరించుకుంటోందని హెచ్చరించారు. అందుకే వెంటనే రైతులు అప్రమత్తమై సర్కార్‌తో చర్చించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని