కరోనా కేసుల డబ్లింగ్‌ టైంలో భారీ తగ్గుదల

దేశంలో ఆ మధ్య తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొద్ది రోజులుగా మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల కలవరపెడుతోంది. ఇదిలా ఉండగా.. తాజా ఉద్ధృతితో దేశంలో

Published : 23 Mar 2021 14:57 IST

కొత్త కేసుల్లో 81శాతం.. ఆరు రాష్ట్రాల్లోనే

దిల్లీ: దేశంలో ఆ మధ్య తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొద్ది రోజులుగా మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల కలవరపెడుతోంది. ఇదిలా ఉండగా..  దేశంలో కరోనా కేసుల రెట్టింపు కాలం(డబ్లింగ్‌ టైం) కూడా సగానికి పైగా తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. మార్చి ఒకటిన 504.4 రోజులుగా ఉన్న డబ్లింగ్‌ సమయం మార్చి 23 నాటికి 202.3 రోజులకు తగ్గిందని తెలిపింది. దాదాపు 20 రోజుల వ్యవధిలోనే డబ్లింగ్‌ రేటులో భారీ తగ్గుదల నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 

10 రాష్ట్రాల్లో.. కేసులు పైపైకి

24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 40,715 కొత్త కేసులు బయటపడగా.. ఇందులో 80.90శాతం కేసులు కేవలం ఆరు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 24,645(60.53శాతం) కేసులు వెలుగుచూడగా.. పంజాబ్‌లో 2,299, గుజరాత్‌లో 1,640 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. ఇక దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీ, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్‌లో రోజువారీ కేసుల్లో పెరుగుదల కన్పిస్తోన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

75శాతం యాక్టివ్‌ కేసులు.. 3 రాష్ట్రాల్లోనే

ఫిబ్రవరి మధ్యలో గణనీయంగా తగ్గిన క్రియాశీల కేసులు.. ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.45లక్షలల యాక్టివ్‌ కేసులుండగా.. ఇందులో 75.15శాతం కేవలం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఒక్క మహారాష్ట్రలోనే 62.71శాతం క్రియాశీల కేసులున్నాయి. ఇక 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 199 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్ర, పంజాబ్‌లో 58 మంది చొప్పున మరణించగా.. కేరళ, చత్తీస్‌గఢ్‌లో 12 మంది చొప్పున చనిపోయారు. 

14 రాష్ట్రాల్లో.. మరణాల్లేవ్‌

దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సోమవారం కరోనాతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌, గోవా, ఉత్తరాఖండ్‌, ఒడిశా, లక్షద్వీప్‌, సిక్కిం, డామన్‌ డయ్యూ - దాద్రానగర్‌ హవేలీ, లద్దాఖ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని తెలిపింది. 

టీకా పంపిణీలో రికార్డు..

మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. సోమవారం రికార్డు స్థాయిలో 32.53లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఒకరోజులో ఇంత ఎక్కువ మందికి టీకాలు వేయడం ఇప్పటివరకు ఇదే అత్యధికం. దీంతో దేశవ్యాప్తంగా 4.8కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని