2DG ఔషధం: ఇక మార్కెట్‌లో విస్తృతంగా!

కరోనా చికిత్సలో మెరుగైన పనితీరు కనబరుస్తోన్న 2-డీజీ ఔషధాన్ని వాణిజ్యపరంగా మార్కెట్‌లో విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ప్రకటించింది.

Published : 28 Jun 2021 15:36 IST

డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడి

దిల్లీ: కరోనా చికిత్సలో మెరుగైన పనితీరు కనబరుస్తోన్న 2-డీజీ ఔషధాన్ని వాణిజ్యపరంగా మార్కెట్‌లో విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం టైర్‌-1 నగరాల్లోనే అందుబాటులో ఉన్న ఈ ఔషధం, ఇకనుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ లభ్యమవుతుందని వెల్లడించింది. ఈ ఔషధం గరిష్ఠ ధర రూ.990గా నిర్ణయించగా, ప్రభుత్వాలకు మాత్రం రాయితీ ధరలో అందిస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. అయితే ఈ ఔషధాన్ని కేవలం వైద్యుల సూచన మేరకు, ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే ఇస్తారు.

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) భాగస్వామ్యంతో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ 2-డీజీ ఔషధాన్ని వినియోగంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్‌-19 బాధితులు త్వరగా ఉపశమనం పొందడంలో ఈ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. కరోనా బాధితులకు దీన్ని ఇచ్చినప్పుడు, వారిలో వైరస్‌ వృద్ధి ఆగిపోయి త్వరగా కోలుకుంటున్నట్లు క్లినికల్‌ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. దీంతో కొవిడ్‌ బాధితుల చికిత్సలో వినియోగించేందుకు ఈ మందుకు భారత ఔషధ నియంత్రణ మండలి అత్యవసర అనుమతి కూడా ఇచ్చింది.

ఇదిలా ఉంటే, 2-డీజీ ఔషధ ఉత్పత్తిని గణనీయంగా పెంచి.. విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు డీఆర్‌డీఓ ప్రయత్నాలు చేస్తోంది. 2-డీజీ ఉత్పత్తికోసం ముందుకొచ్చే ఫార్మా కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా డీఆర్‌డీఓతో శిల్పా మెడికేర్‌కు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని