స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ ఆమోదం!

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతించింది. కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ) నియమించిన నిపుణుల కమిటీ సోమవారం చేసిన సిఫార్సులకు డీసీజీఐ తాజాగా ఆమోదం తెలిపింది.

Updated : 14 Apr 2021 09:48 IST

ఈ టీకాను అనుమతించిన 60 దేశంగా భారత్‌

దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతించింది. కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ) నియమించిన నిపుణుల కమిటీ సోమవారం చేసిన సిఫార్సులకు డీసీజీఐ తాజాగా ఆమోదం తెలిపింది. డీసీజీఐ అనుమతితో వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు మార్గం సుగమమైనట్లు భారత్‌లో స్పుత్నిక్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోన్న డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన స్పుత్నిక్‌ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీకి గతేడాది సెప్టెంబర్‌లోనే డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా.. రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ దాదాపు 1600 మంది వాలంటీర్లపై నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌, అనుమతి కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. వీటి ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ.. భారత్‌లో అత్యవసర వినియోగానికి ఏప్రిల్‌ 12న పచ్చజెండా ఊపింది. నిపుణుల కమిటీ పంపిన సిఫార్సులను పరిశీలించిన డీసీజీఐ, 24 గంటలు తిరగకముందే స్పుత్నిక్‌-వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. తద్వారా భారత్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తో పాటు మూడో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో స్పుత్నిక్‌ టీకాను ఆమోదించిన 60వ దేశంగా భారత్‌ నిలిచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ఆమోదం పొందిన వ్యాక్సిన్లలో స్పుత్నిక్‌-వి రెండో స్థానంలో ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని