Presidential Election: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలో ....

Updated : 21 Jun 2022 23:23 IST

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు (Presidential Election) ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. తమ అభ్యర్థిగా ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్మును (Draupadi Murmu) బరిలో దించుతున్నట్టు భాజపా ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఈ అంశాన్ని ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 20మంది పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఏన్డీయే పక్షాలన్నింటితో చర్చించాకే ఈ నిర్ణయం ప్రకటిస్తున్నామని నడ్డా తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అన్నారు. మంత్రిగా, గవర్నర్‌గా ఆమె రాణించారన్నారు. 

విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హాకు దీటుగా ఒడిశాకు చెందిన ఆదివాసీ మహిళా నేతగా ఉన్న  64 ఏళ్ల ద్రౌపది ముర్మును భాజపా పోటీలో దించింది. ఎన్నికల్లో నెగ్గితే.. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్ర లిఖించనున్నారు. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో ఈమె పేరు ప్రధానంగా చర్చకు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో బిహార్‌ గవర్నర్‌గా ఉన్న ఎస్సీ నేత రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసిలో 1958 జూన్‌ 20న ద్రౌపది ముర్ము జన్మించారు. మొదట టీచర్‌గా పనిచేసిన ఆమె..  ఆ తర్వాత కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాారు. ఆ తర్వాత రాయ్‌రంగపూర్‌ నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.  రెండు పర్యాయాలు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైన ఆమె.. భాజపా- బిజూ జనతాదళ్‌ కలిసి ఏర్పాటుచేసిన నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో 2000- 2004 మధ్య మంత్రిగా పనిచేశారు. 2010, 2013లో మయూర్‌భంజ్‌ భాజపా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013లో భాజపా ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా ఉన్నారు. 2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్‌ గవర్నర్‌గా సేవలందించారు. ఆమెకు భర్త శ్యామ్‌ చరణ్‌ ముర్ము, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారు: మోదీ ట్వీట్‌
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికన కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ద్రౌపది ముర్ము తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారని కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసమే కృషిచేశారన్నారు. ఆమెకు విశేష పరిపాలనా అనుభవం ఉందన్నారు. ద్రౌపది ముర్ము మన దేశానికి గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. పేదరికాన్ని, కష్టాలు అనుభవించిన లక్షలాది మంది ప్రజలకు ఆమె జీవితం ఎంతో ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు. విధానపరమైన అంశాలపై ఆమెకు ఉన్న అవగాహన, దయతో కూడిన ఆమె స్వభావం మన దేశానికి ఎంతో మేలు చేస్తాయన్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని