Presidential Election: హస్తినలో ద్రౌపదీ ముర్మూ.. ప్రధాని మోదీతో భేటీ

రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Election) ఎన్డీయే తరఫున బరిలో దిగిన ద్రౌపదీ ముర్మూ (Draupadi Murmu) హస్తినకు చేరుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా .......

Updated : 23 Jun 2022 17:08 IST

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Election) ఎన్డీయే తరఫున బరిలో దిగిన ద్రౌపదీ ముర్మూ (Draupadi Murmu) హస్తినకు చేరుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి దేశ రాజధానికి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. దిల్లీ భాజపా ముఖ్య నేతలు ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈరోజే ఆమె భువనేశ్వర్‌ నుంచి దిల్లీ చేరుకున్నారు. ఒడిశా భవన్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న ద్రౌపది.. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ద్రౌపదితో సమావేశమైనట్టు ప్రధాని స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. భేటీకి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెను ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాల వారూ ప్రశంసించారని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన, దేశ అభివృద్ధి పట్ల విజన్‌ గొప్పదంటూ కొనియాడారు. అనంతరం ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు.

మరోవైపు, ద్రౌపది నామినేషన్‌ పత్రాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ నివాసంలో సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ సంతకాలు చేసే వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్‌ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షాతో పాటు భాజపా   జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, భాజపా సీనియర్‌ నేతలు ఉన్నట్టు సమాచారం. అలాగే, ద్రౌపది అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన బిజూ జనతాదళ్‌ నుంచి సస్మిత్‌ పాత్రా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేసేందుకు జోషీ నివాషం వద్ద ఉన్నారు. పలువురు అగ్రనేతల సమక్షంలో ద్రౌపదీ ముర్మూ తన నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. దిల్లీ బయల్దేరడానికి ముందు ఆమె భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అందరి సహకారం కోరతానన్నారు. ఓటర్లందరినీ (చట్టసభ్యులు) జులై 18లోపు కలిసి మద్దతు కోరనున్నట్టు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు