Pinaka: ‘పినాక ఈఆర్‌’ పరీక్షలు విజయవంతం.. పరిధి మరింత మెరుగు!

భారత సైన్యం ఆయుధ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. తాజాగా ఎక్స్‌టెండెడ్ రేంజ్ పినాక మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్‌ సిస్టమ్‌(పినాక- ఈఆర్‌)ను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ శనివారం వెల్లడించింది. పోఖ్రాన్‌ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లలో ఈ ప్రక్రియ నిర్వహించినట్లు...

Published : 11 Dec 2021 23:51 IST

దిల్లీ: భారత సైన్య ఆయుధ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. తాజాగా ఎక్స్‌టెండెడ్ రేంజ్ పినాక మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్‌ సిస్టమ్‌(పినాక- ఈఆర్‌)ను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ శనివారం వెల్లడించింది. పోఖ్రాన్‌ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లలో ఈ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) బదిలీ చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఓ ప్రైవేట్ పరిశ్రమ వాటిని రూపొందించింది. ‘సైన్యంతో కలిసి డీఆర్‌డీఓ.. మూడు రోజులపాటు 24 పినాక రాకెట్‌ల ట్రయల్స్‌ నిర్వహించింది. వివిధ వార్‌హెడ్ సామర్థ్యాలతో, వివిధ రేంజ్‌లలో వాటిని పరీక్షించింది. సంతృప్తికర ఫలితాలు వచ్చాయి’ అని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

డీఆర్‌డీఓ ప్రయోగశాలల్లో అభివృద్ధి..

డీఆర్‌డీఓ సైతం ఈ మేరకు ఓ ట్వీట్‌ చేస్తూ.. ‘పినాకా ఈఆర్‌తోపాటు ఏరియా డినయల్ మ్యూనిషన్స్‌(ఏడీఎం), స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ప్రాక్సిమిటీ ఫ్యూజ్‌లనూ విజయవంతంగా పరీక్షించిన’ట్లు చెప్పింది. దశాబ్ద కాలంగా సైన్యం ఉపయోగిస్తోన్న మల్టీపుల్‌ రాకెట్ లాంచర్ ‘పినాకా’ పరిధి ఇప్పుడు మరింత మెరుగైనట్లు తెలిపింది. పుణెలోని డీఆర్‌డీఓ ప్రయోగశాలలు.. ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(ఏఆర్‌డీఈ), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ(హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌) సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. అనంతరం.. ఈ సాంకేతికతను ఓ పరిశ్రమకు బదిలీ చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని