Long Range Bomb: డీఆర్‌డీఓ ‘లాంగ్‌ రేంజ్‌ బాంబ్‌’ పరీక్ష విజయంతం

అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని-5’ని ఇటీవల విజయవంతంగా పరీక్షించిన భారత్‌.. తాజాగా మరో ఘనత సాధించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) దేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ బాంబ్(ఎల్‌ఆర్‌బీ)ను భారత వాయుసేన(ఐఏఎఫ్)...

Published : 29 Oct 2021 23:55 IST

భువనేశ్వర్‌: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని-5’ని ఇటీవల విజయవంతంగా పరీక్షించిన భారత్‌.. తాజాగా మరో ఘనత సాధించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ బాంబ్ (ఎల్‌ఆర్‌బీ)ను భారత వాయుసేన (ఐఏఎఫ్) భాగస్వామ్యంతో శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఐఏఎఫ్‌ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ గైడెడ్‌ బాంబ్‌.. భూమి పైనున్న లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మిషన్ లక్ష్యాలన్నీ విజయవంతంగా నెరవేరినట్లు పేర్కొంది. ప్రయోగంలో భాగంగా బాంబ్‌ గమనం, పనితీరును ట్రాక్ చేసేందుకు ఈఓటీఎస్ (ఎలక్ట్రో- ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్), టెలిమెట్రీ, రాడార్‌తో సహా వివిధ శ్రేణుల సెన్సార్‌లను వినియోగించారు. ఈ సెన్సార్‌లను ఇక్కడి చాందీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వద్ద ఏర్పాటు చేశారు.

రాజ్‌నాథ్‌ సింగ్ అభినందన..

ఈ ప్రయోగం విజయవంతంతో ఈ రకమైన దేశీయ పరిజ్ఞాన వ్యవస్థల అభివృద్ధిలో మరో ముఖ్యమైన మైలురాయిని అందుకున్నట్లు రక్షణ శాఖ ఆర్‌ అండ్‌ డీ విభాగం కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి తెలిపారు. ఈ ఎల్‌ఆర్‌బీని హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ లేబోరేటరీ ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ)’, డీఆర్‌డీఓకే చెందిన ఇతర ప్రయోగశాలల సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగం విజయవంతంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. డీఆర్‌డీఓ, ఐఏఎఫ్‌ ఇతర విభాగాల అధికారులను అభినందించారు. ఈ గైడెడ్ బాంబ్‌.. భారత సాయుధ బలగాలకు మరింత పోరాట సామర్థ్యాన్ని చేకూర్చుతుందని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని