VL-SRSAM: నౌకా దళానికి మరింత భరోసా.. స్వల్పశ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం

ఉపరితలం నుంచి గాల్లోకి నిట్టనిలువుగా ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షిపణి(VL-SRSAM)ని భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌(Chandipur) తీరంలో యుద్ధనౌక నుంచి...

Published : 25 Jun 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉపరితలం నుంచి గాల్లోకి నిట్టనిలువుగా ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షిపణి (VL-SRSAM)ని భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌ (Chandipur) తీరంలో యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్‌.. హైస్పీడ్‌ ఏరియల్‌ టార్గెట్‌ను ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు. ‘‘డీఆర్డీవో (DRDO), భారత నావికాదళం (Indian Navy) కలిసి నేడు వీఎల్‌-ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎంను విజయవంతంగా పరీక్షించాయి. ఈ ప్రయోగం ఒడిశా చాందీపూర్ తీరంలో ఇండియన్ నేవల్ షిప్ నుంచి నిర్వహించారు’’ అని డీఆర్డీవో అధికారి తెలిపారు. యుద్ధ నౌకలనుంచి ప్రయోగించే ఈ క్షిపణి.. రాడార్‌కు దొరకకుండా సీ-స్కిమ్మింగ్‌ సాంకేతికతతో దూసుకొచ్చే లక్ష్యాలతోపాటు సమీప పరిధిలోని వివిధ వైమానిక టార్గెట్‌లను కూల్చివేస్తుంది.

తాజా ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో, నౌకాదళం, పరిశ్రమ వర్గాలను అభినందించారు. వైమానిక ముప్పుల నుంచి భారత నౌకల రక్షణ సామర్థ్యాన్ని ఈ ప్రయోగం.. మరింత మెరుగుపరిచిందని పేర్కొన్నారు. డీఆర్డీవో ఛైర్మన్‌ డా.జి.సతీశ్‌ రెడ్డి, నేవల్ స్టాఫ్ చీఫ్, అడ్మిరల్ ఆర్‌.హరికుమార్‌ సైతం ఈ పరీక్షలో పాలుపంచుకున్న బృందాలను అభినందించారు. ఈ స్వదేశీ క్షిపణి వ్యవస్థ.. నౌకాదళ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా మరో మైలురాయి అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు