DRDO: గర్భిణీలకు 2డీజీ ఔషధం ఇవ్వొద్దు

కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) రూపొందించిన 2-డీజీ ఔషధాన్ని గర్భిణిలు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ ఔషధాన్ని

Updated : 01 Jun 2021 15:20 IST

మార్గదర్శకాలు విడుదల చేసిన డీఆర్‌డీవో

దిల్లీ: కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) రూపొందించిన 2-డీజీ ఔషధాన్ని గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ ఔషధాన్ని ఎలా వినియోగించాలో చెబుతూ నేడు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును ఇవ్వాలని సూచించింది. 

2-డీజీ వినియోగానికి మార్గదర్శకాలివే..

* ఆసుపత్రిలో చికిత్స తీసుకునే కొవిడ్‌ రోగులకు అనుబంధ చికిత్సగా ఉపయోగించేందుకు 2-డీజీ ఔషధానికి అత్యవసర అనుమతి లభించింది. 

* మధ్యస్తం నుంచి తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న కొవిడ్‌ రోగులకు సాధ్యమైనంత త్వరగా అంటే 10 రోజుల్లోపు వైద్యులు ఈ ఔషధాన్ని సూచించాలి

*  నియంత్రణలేని డయాబెటిస్‌, తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు, అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిపై ఈ ఔషధాన్ని ఇంకా పరీక్షించలేదు. అందువల్ల అలాంటి వారి విషయంలో ముందుజాగ్రత్త అవసరం. 

* గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18ఏళ్లు లోపు వారికి 2-డీజీ ఔషధాన్ని ఇవ్వకూడదు.
 
ఈ సందర్భంగా ఈ ఔషధ సరఫరా కోసం రోగులు, వైద్య సిబ్బంది డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ను సంప్రదించొచ్చని డీఆర్‌డీవో వెల్లడించింది. కొవిడ్‌ చికిత్సలో 2-డీజీ ఔషధ వినియోగానికి ఇటీవల అత్యవసర అనుమతులు లభించిన విషయం తెలిసిందే. పొడి రూపంలో ఉండే ఈ మందును నీళ్లలో కలుపుకుని తాగడం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చని ఇప్పటికే డీఆర్‌డీవో ప్రకటించింది. త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఈ ఔషధం ఒక్కో సాచెట్‌ ధరను డాక్టర్‌ రెడ్డీస్‌ రూ. 990గా నిర్ణయించినట్లు ఇటీవల ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని