DRDO: 2DG ఔషధం విడుదల

కొవిడ్‌ బాధితులకు శుభవార్త. కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే 2డీజీ ఔషధాన్ని

Updated : 17 May 2021 11:58 IST

దిల్లీ : కొవిడ్‌ బాధితులకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ‘2డీజీ(2-డియాక్సీ డి-గ్లూకోజ్‌)’ ఔషధం విడుదలైంది. దిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలి బ్యాచ్‌ 2డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు అందించారు. ఆరోగ్యమంత్రి వాటిని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు ఇచ్చారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. 2డీజీ ఔషధంతో కొవిడ్‌ రికవరీ సమయం తగ్గడంతో పాటు ఆక్సిజన్‌ అవసరం కూడా తగ్గుతుందని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరులో డీఆర్‌డీవో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. 

తొలి విడతలో 10వేల సాచెట్లను అందుబాటులోకి తెచ్చారు. మే 27, 28 తేదీల్లో రెండో విడతలో భాగంగా మరిన్ని సాచెట్లను విడుదల చేస్తామని, జూన్‌ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ తెలిపింది. అయితే దీని ధరను డీఆర్‌డీవో ఇంకా ప్రకటించలేదు. కొవిడ్‌ పోరులో ఈ ఔషధం అత్యవసర వినియోగానికి మే 1న డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

కరోనా కట్టడి కోసం డీఆర్‌డీవో ఏడాది పాటు శ్రమించి ఈ ఔషధాన్ని తీసుకొచ్చింది. గతంలో దీన్ని క్యాన్సర్‌ కోసం తయారుచేశారు. శరీరంలో క్యాన్సర్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కొవిడ్‌కు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్‌ వైరస్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకపోతే కణ విభజన జరగదని, ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా ఆగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు