Wine sales: వైన్‌ తాగడం ఆరోగ్యానికి హానికరమే.. కానీ!: మంత్రి రాజేశ్‌ తోపే

కొందరు వ్యక్తులు గంజాయి విక్రయాలపై సానుకూలంగా మాట్లాడుతున్నారని, కానీ గంజాయితో వైన్‌కు పోలికలేదన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని........

Published : 31 Jan 2022 23:29 IST

జల్నా: మహారాష్ట్రలోని సూపర్‌ మార్కెట్లలో వైన్‌ విక్రయించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే సమర్థించుకున్నారు. వైన్‌ తాగడం ఆరోగ్యానికి హానికరమే అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ మార్కెట్లు, వాక్‌ ఇన్‌ స్టోర్లలో విక్రయించాలని నిర్ణయం తీసుకుందన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైన్‌ని గంజాయితో పోల్చడం సరికాదన్నారు.

సూపర్‌ మార్కెట్లు, వాక్‌ ఇన్‌ స్టోర్‌లలో వైన్‌ అమ్మకాలకు అనుమతిస్తూ గత వారంలో మహారాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై భాజపా ఎంపీ ప్రతాప్‌ పాటిల్‌ చిఖిలార్‌ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు గంజాయి సాగుకు కూడా ప్రభుత్వం అనుమతివ్వాలన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ.. వైన్‌ తాగడం ఆరోగ్యానికి హానికరమే అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వైన్‌ తాగాలని ఎవరినీ ఆహ్వానించడంలేదన్నారు. రైతుల ఆర్థిక ప్రయోజనాలకు ఈ నిర్ణయం మంచిదేనని మంత్రి అభిప్రాయపడ్డారు. 

కొందరు వ్యక్తులు గంజాయి విక్రయాలపై సానుకూలంగా మాట్లాడుతున్నారని, కానీ గంజాయితో వైన్‌కు పోలికలేదన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. వైద్య కళాశాలల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని, నిధులు కేటాయించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. ఇది కరోనా నుంచి మాత్రమే కాకుండా 21 ఇతర వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో చేపట్టిన ఓ అధ్యయనంలో తేలిందన్నారు. మరోవైపు, మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖా మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ కూడా మద్యం విక్రయాలపై ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ నిన్న వ్యాఖ్యానించారు. రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని భాజపా వ్యతిరేకిస్తోందంటూ మండిపడ్డారు. 

సూపర్‌ మార్కెట్లు, వాక్‌ ఇన్‌ (నేరుగా వెళ్లి కొనుగోలు చేసే) దుకాణాల్లోనూ వైన్‌ అమ్మకాలకు అనుమతిస్తూ ‘షెల్ఫ్‌ ఇన్‌ షాప్‌’ విధానానికి రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. వైన్‌ అమ్మే వాక్‌ ఇన్‌ దుకాణాలకు 1000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం ఉండాలన్న షరతు విధించింది. వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లకు మంచి ధరలు లభించాలనే ఉద్దేశంతోనే మద్యం పాలసీని మార్చినట్టు మంత్రి నవాబ్‌ మాలిక్‌ చెప్పారు. పండ్ల ద్వారా తయారుచేసిన వైన్‌ విక్రయాలు పెరగటం ద్వారా రైతులకు గరిష్ఠ ధరలు లభిస్తాయని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై భాజపా నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం.. మహారాష్ట్రను ‘మద్య రాష్ట్ర’గా మార్చాలని చూస్తోందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విమర్శలు కురిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని