Drone: పెన్షన్‌.. డ్రోన్‌ తీసుకొచ్చెన్‌..!

హితారామ్‌ సత్నామీ అనే దివ్యాంగుడు తన పింఛను కోసం ప్రతినెలా 2 కిలోమీటర్లు అటవీమార్గంలో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఈ నెల అతడికి తన పింఛను డబ్బులు నేరుగా ఇంటి ముందు పడ్డాయి. ఆ డబ్బులను డ్రోన్‌ మోసుకొచ్చింది.

Published : 21 Feb 2023 01:17 IST

భువనేశ్వర్‌: ఇటీవలి కాలంలో డ్రోన్ల (Drone) వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఔషధాల నుంచి పార్శిళ్లు, నిత్యావసరాలు, ఫుడ్‌ డెలివరీల వరకు అనేక వస్తువులను సుదూర ప్రాంతాలకు వేగంగా అందించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశంలో తొలిసారిగా డ్రోన్‌తో డబ్బును డెలివరీ చేశారు. అదీ కూడా ఓ దివ్యాంగుడికి ఫించను (Pension) అందించారు.

ఒడిశా (Odisha)లోని నువాపడ జిల్లా భాలేశ్వరన్‌ పంచాయతీ పరిధిలోని మారుమూల భుక్తపద ప్రాంతానికి చెందిన హితారామ్‌ సత్నామీ పుట్టుకతోనే దివ్యాంగుడు. దట్టమైన అడవిలో ఉండే ఈ గ్రామం నుంచి అతడు పింఛను కోసం ప్రతి నెలా 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలి. అతడి గురించి తెలుసుకున్న సర్పంచి సరోజ్‌ అగర్వాల్‌.. ఆన్‌లైన్‌లో ఓ డ్రోన్‌ (Drone) కొనుగోలు చేశారు. దాని సాయంతో సత్నామీ ఇంటికి పింఛను డబ్బులను పంపించారు. దీంతో అతడికి ఎంతో ఊరట లభించనట్లైంది.

ఈ సందర్భంగా సర్పంచి సరోజ్‌ మాట్లాడుతూ.. ‘‘వివిధ దేశాల్లో డ్రోన్లతో వస్తువులను డెలివరీ చేయడం చూసి నాకు ఈ ఆలోచన వచ్చింది. దీంతో నేను డ్రోన్‌ కొనుగోలు చేసి ఆయనకు పింఛను (Pension) డబ్బులు పంపించాను’’ అని తెలిపారు. అయితే ఆ దివ్యాంగుడి కోసం సొంత డబ్బుతో డ్రోన్‌ను కొనుగోలు చేసిన సర్పంచి చొరవను పైఅధికారులు అభినందించారు. ‘‘పింఛను కోసం డ్రోన్‌ సేవలకు ప్రభుత్వం వద్ద ఎలాంటి విధివిధానాలు లేనప్పటికీ ఆమె సొంతంగా ఈ వినూత్న చర్యకు శ్రీకారం చుట్టారు’’ అని నువాపడా బ్లాక్‌ డెవలప్‌మెంట్ అధికారి సుబేదార్‌ ప్రధాన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని