Scindia: వచ్చే నాలుగైదేళ్లలో ఆ రంగంలో లక్ష ఉద్యోగాలు: సింధియా

దేశంలోని డ్రోన్‌ సర్వీస్‌ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రాబోయే నాలుగైదేళ్లలో......

Updated : 22 Apr 2022 16:13 IST

దిల్లీ: దేశంలోని డ్రోన్‌ సర్వీస్‌ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రాబోయే నాలుగైదేళ్లలో ఈ రంగంలో లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. శుక్రవారం దిల్లీలో ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐఏసీసీ) ఆధ్వర్యంలో జరిగిన  ఓ కార్యక్రమంలో సింధియా మాట్లాడారు. డ్రోన్‌ రంగం కోసం ఉత్పాదకత అనుసంధాన పథకాన్ని చేపట్టామనీ.. ఇక్కడ డ్రోన్‌ తయారీకి సంబంధించి ఓ కొత్త పరిశ్రమ ఆదాయం రూ.60కోట్లుగా ఉంటే..  వచ్చే మూడేళ్లలో ఆ పరిశ్రమ రూ.120 కోట్ల ప్రోత్సాహకం పొందే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. గతేడాది ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద డ్రోన్లు, డ్రోన్‌ విడిభాగాల తయారీదారులకు రాబోయే మూడేళ్లలో కంపెనీ చేసిన వాల్యూ అడిషన్‌లో 20శాతం ప్రోత్సాహకం ఉంటుందన్నారు. పీఎల్‌ఐ పథకం కింద 14 డ్రోన్‌ కంపెనీలు లబ్ధిదారులుగా ఎంపికైనట్టు ఇప్పటికే పౌరవిమానయాన మంత్రిత్వశాఖ  జాబితాను విడుదల చేసినట్టు పేర్కొన్నారు.

డ్రోన్ల తయారీ రంగాన్ని విస్తరించేందుకు దాదాపు రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం చూస్తోందని సింధియా అన్నారు. ఈ రంగంలో వచ్చే నాలుగైదేళ్లలో లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. భారత్‌లో నగరీకరణ భారీగా జరుగుతోందనీ.. 2031 నాటికి జాతీయ ఆదాయంలో 75శాతం నగరాలనుంచే వస్తుందని పేర్కొన్నారు. వచ్చే దశాబ్దంలో భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించడంలో రవాణా, లాజిస్టిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 140 విమానాశ్రయాలు ఉన్నాయన్న సింధియా.. రాబోయే నాలుగైదేళ్లలో మరో 50శాతం పెంచేందుకు కేంద్రం యోచిస్తోందన్నారు. అలాగే ప్రస్తుతం వాణిజ్య విమానాలు 710 ఉండగా.. వాటిని రాబోయే ఐదేళ్లలో 1200కి పెంచనున్నట్టు తెలిపారు. వైమానిక శిక్షణా సంస్థల్ని భారీగా పెంచాలని కేంద్రం చూస్తోందన్నారు. ప్రస్తుతం 34 శిక్షణా సంస్థలు ఉండగా.. వాటిని కొద్ది సంవత్సరాల్లోనే 58కి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ఎయిర్‌క్రాఫ్ట్‌ కాంపోనెంట్‌ పరిశ్రమ భారత్‌లో దూసుకుపోతోందన్నారు. బోయింగ్‌ సంస్థ ప్రస్తుతం భారత్‌ నుంచి 1బిలియన్‌ డాలర్ల విమాన విడిభాగాలను దిగుమతి చేసుకుంటుండగా.. ఎయిర్‌బస్‌ సంస్థ కూడా 650 మిలియన్‌ డాలర్ల మేర విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నట్టు సింధియా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని