Drone: బెంగళూరు స్టార్టప్‌ ప్రపంచ రికార్డ్‌?.. అత్యంత ఎత్తైన పాస్‌ వద్ద డ్రోన్‌ పరీక్ష

బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్‌ అరుదైన ఘనతను సాధించింది. సైన్యానికి ఉపయోగపడే డ్రోన్‌ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కనుమ వద్ద పరీక్షించింది. 

Updated : 11 Jul 2024 17:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కనుమగా పేరున్న లద్ధాఖ్‌లోని ఉమ్‌లాంగ్‌ లా పాస్‌ వద్ద బెంగళూరుకు చెందిన న్యూస్పేస్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సంస్థ డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. దీనిని ఈ శ్రేణి డ్రోన్ల సామర్థ్యంలో ప్రపంచ రికార్డుగా చెబుతున్నారు. ఇది దాదాపు 25 కిలోల పేలోడ్‌ తీసుకొని.. 100 కిలోల టేకాఫ్‌ సామర్థ్యంతో పని చేసింది.

ఓ ఆంగ్ల పత్రికకు ఆ కంపెనీ సీఈవో సమీర్‌ జోషీ స్వయంగా ఈవిషయాన్ని వెల్లడించారు. ఈ డ్రోన్‌ పనిచేసే పరిధి కూడా చైనాకు చెందిన డీజేఐ ఫ్లైకార్ట్‌ 30 రకం కంటే చాలా మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.  ఏప్రిల్‌ 24న చైనా డీజేఐ డ్రోన్లను మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ వద్ద ప్రదర్శించింది. అయితే తమ డ్రోన్‌ సముద్రమట్టం కంటే దాదాపు 6,200 మీటర్ల ఎత్తులో కూడా విజయవంతంగా ఎగిరిందని న్యూస్పేస్‌ సీఈవో పేర్కొన్నారు. 

100 కేజీల అత్యధిక టేకాఫ్‌ శ్రేణిలో న్యూస్పేస్‌ డ్రోన్‌దే ప్రపంచ రికార్డని జోషీ వెల్లడించారు. తమ డ్రోన్లు సైనిక, పౌర అవసరాలకు బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ‘‘ఈ డ్రోన్ల రవాణాకు, విపత్తు నిర్వహణ, సహాయక చర్యలు, మెడికల్‌ రిలీఫ్‌ సేవలకు మెరుగ్గా ఉపయోగపడుతుంది’’ అని జోషీ పేర్కొన్నారు. 

ఈ పరిణామంపై రిటైర్డ్‌ ఎయిర్‌ వైస్‌మార్షల్‌ మన్మోహన్‌ బధోరియా మాట్లాడుతూ ‘‘ఇది పేలోడ్‌ పరంగా, ఆల్టిట్యూడ్‌ పరంగా మనకు శుభవార్త. సియాచిన్‌ వంటి ప్రాంతాల్లో ముఖ్యమైన చిన్న పరికరాలు, ఔషధాలు వంటివి సరఫరా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది’ అని  పేర్కొన్నారు. 

యుద్ధ విమానం నిర్వహణ ఖర్చు ఎత్తైన ప్రాంతాల్లో అత్యధికంగా ఉంటుంది. ఒక చీతా హెలికాప్టర్‌ 25 కిలోల పేలోడ్‌తో అంత ఎత్తులో ప్రయాణించడానికి.. డ్రోన్‌ ద్వారా అంతే బరువైన వస్తువులు పంపడానికి అయ్యే ఖర్చలో చాలా తేడా ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని