Presidential Election: నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము.. యశ్వంత్‌ సిన్హాపై ఘన విజయం

రాష్ట్రపతి ఎన్నికల్లో(Presidential Election) ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి.....

Updated : 21 Jul 2022 22:21 IST

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో(Presidential Election) ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై విజయం సాధించి భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు రౌండ్లలో లెక్కింపు జరగ్గా.. ఒక రౌండ్‌ మిగిలి ఉండగానే ఆమె 50శాతానికి పైగా ఓట్లు సాధించడం ద్వారా  దేశంలో అత్యున్నత పీఠాన్ని దక్కించుకున్న తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా 4754 ఓట్లు పోలవ్వగా.. 53 ఓట్లు చెల్లుబాటు కానివిగా గుర్తించారు. చెల్లుబాటైన 4701 ఓట్లలో ద్రౌపదీ ముర్ము  2,824 ఓట్లు సాధించగా..  వాటి విలువ 6,76,803 అని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌, రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ వెల్లడించారు. అలాగే, యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు రాగా.. వాటి విలువ 3,80,177. దీంతో ద్రౌపదీ ముర్ము నూతన రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు.

 

  1. తొలి రౌండ్‌ ఫలితం: తొలి రౌండ్‌లో ఎంపీల ఓట్లు లెక్కించారు. మొత్తం 763మంది ఎంపీలు ఓటు వేయగా.. వీటిలో 15 ఓట్లు చెల్లలేదు. దీంతో 748 ఓట్లలో ద్రౌపదీ ముర్ముకు 540 ఓట్లు రాగా (విలువ 3,78,000).. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు (విలువ 1,45,600) వచ్చాయని రిటర్నింగ్‌ అధికారి, రాజస్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ తెలిపారు. 
  2. రెండో రౌండ్‌ ఫలితం: రెండో రౌండ్‌లో ద్రౌపదీ ముర్ము భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రెండో రౌండ్‌లో 10 రాష్ట్రాలను ఆంగ్ల అక్షర క్రమంలో తీసుకొని ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల సంఖ్య 1138 కాగా.. వాటి విలువ 1,49,575. వీటిలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు 809 ఓట్లు (ఓట్ల విలువ 1,05,299) రాగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 329 (ఓట్ల విలువ 44,276) వచ్చాయి. 
  3. మూడో రౌండ్‌: మూడో రౌండ్‌ లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్‌లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్‌, ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాలు కవర్‌ అయ్యాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోడీ వెల్లడించారు. ఈ రౌండ్‌లో 1333 ఓట్లు చెల్లుబాటు కాగా.. వీటి విలువ 1,65,664గా ఉన్నట్టు తెలిపారు. వీటిలో ద్రౌపదీ ముర్ముకు 812 ఓట్లు, యశ్వంత్‌ సిన్హాకు 521 ఓట్లు వచ్చినట్టు వెల్లడించారు.
  4. నాలుగు రౌండ్లలో కలిపి ఇలా.. ఈ ఎన్నికల్లో మొత్తంగా 4,754 ఓట్లు పోలవ్వగా.. 53 ఓట్లు చెల్లుబాటు కానివిగా గుర్తించారు. చెల్లుబాటైన 4,701 ఓట్లలో ద్రౌపదీ ముర్ము  2,824 ఓట్లు సాధించగా..  వాటి విలువ 6,76,803. అలాగే, యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు రాగా.. వాటి విలువ 3,80,177. నూతన రాష్ట్రపతిగా భారీ విజయం సాధించిన ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. దిల్లీలోని ఆమె తాత్కాలిక నివాసానికి వెళ్లిన ప్రధాని.. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.
  5. ద్రౌపదీ ముర్ముకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమెకు అభినందనలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ద్రౌపదీకి మద్దతు తెలిపిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ ఈ సందర్భంగా మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
  6. ద్రౌపదీ ముర్ము స్వగ్రామం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 20వేల మిఠాయిలు చేసి సిద్ధంగా ఉంచారు. ఫలితాలు వెలువడ్డాక ఆదివాసీ సంప్రదాయ నృత్యంతో విజయోత్సవ ఊరేగింపు నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 
  7. కౌంటింగ్‌ ఈ మధ్యాహ్నం 1.30గంటలకు పార్లమెంట్‌ హౌస్‌లో ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో ఎంపీల ఓట్లు లెక్కించగా.. ఆ తర్వాత అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు.
  8. ముర్ము విజయం సాధించాక దిల్లీ భాజపా విజయోత్సవ రోడ్‌షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్‌పథ్‌ వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ రోడ్‌షోలో భాజపా సీనియర్‌ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే, అన్ని రాష్ట్రాల్లో భాజపా నేతలు విజయోత్సవ వేడుకలకు సిద్ధమయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని