Jammu Kashmir: కశ్మీర్‌లోకి డ్రగ్స్‌ చేరవేత యత్నం భగ్నం.. రూ.25 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

కశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో భద్రతాదళాలు రూ.25 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి లభ్యమైన ఈ మాదక ద్రవ్యాలను అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించాయి. బారాముల్లా సీనియర్‌ ఎస్పీ రాయీస్...

Updated : 03 Oct 2021 19:24 IST

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో భద్రతాదళాలు రూ.25 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి లభ్యమైన ఈ మాదక ద్రవ్యాలను అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించాయి. బారాముల్లా సీనియర్‌ ఎస్పీ రాయీస్ అహ్మద్‌ ఆదివారం వివరాలు వెల్లడించారు. ‘శనివారం విధుల్లో ఉన్న జవాన్లు.. సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికలను గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమయ్యారు. తనిఖీల్లో భాగంగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు’ అని తెలిపారు. దీంతో సరిహద్దు అవతలివైపు నుంచి కశ్మీర్‌లోకి మాదక ద్రవ్యాల చేరవేత యత్నాన్ని భగ్నం చేసినట్లయిందన్నారు. సుమారు 25 నుంచి 30 కిలోల హెరాయిన్‌ పట్టుబడిందని, మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుందని ఎస్‌ఎస్పీ చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించిన మాడ్యూల్‌ను త్వరలోనే ఛేదించే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు ఆదివారం ఉదయం కశ్మీర్‌లోని సౌజానా గ్రామంలో పోలీసులు.. ఓ ఏకే-47, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోప్‌ ఉన్న ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ వైపు నుంచి వచ్చిన ఓ డ్రోన్ ఈ ఆయుధాలను జారవిడిచినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని, భారత్‌లో ఈ ఆయుధాలను ఎవరు తీసుకోవాల్సి ఉందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని