ఎన్‌ఆర్‌ఐ కంపెనీలో ఉద్యోగుల భార్యలకూ వేతనాలు!

తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యాలు నెలనెలా జీతాలు ఇస్తుంటాయి. ఏటా బోనస్‌లు.. లాభాలు వచ్చినప్పుడు, ఉద్యోగి ప్రతిభ కనబర్చినప్పుడు ప్రోత్సాహకాలూ అందిస్తుంటాయి. కానీ, దుబాయ్‌లోని సంస్థ తమ ఉద్యోగులకే కాదు.. వారి భార్యలకు కూడా

Updated : 14 Feb 2021 13:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యాలు నెలనెలా జీతాలు ఇస్తుంటాయి. ఏటా బోనస్‌లు.. లాభాలు వచ్చినప్పుడు, ఉద్యోగి ప్రతిభ కనబర్చినప్పుడు ప్రోత్సాహకాలూ అందిస్తుంటాయి. కానీ, దుబాయ్‌లోని సంస్థ తమ ఉద్యోగులకే కాదు.. వారి భార్యలకు కూడా వేతనం ఇస్తామంటోంది. ప్రస్తుతం విధివిధానాలు రూపొందిస్తున్నామని, త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. వివరాళ్లోకి వెళ్తే..

కేరళకు చెందిన డాక్టర్‌ సోహన్‌ రాయ్‌.. కొన్నేళ్ల కిందట దుబాయ్‌లోని షార్జాకి వెళ్లి స్థిరపడ్డారు. ఎరిస్‌ అనే సంస్థను స్థాపించి అనతి కాలంలో ఎరిస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీగా మార్చారు. ఈ గ్రూప్‌లో మెరైన్‌, ఇంజినీరింగ్‌, చమురు ఇలా 50కిపైగా కంపెనీలు ఉన్నాయి. అయితే, తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాల్లో ఉద్యోగం లేని భార్యలకు జీతం ఇవ్వాలని రాయ్‌ ఇటీవల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు. ఉద్యోగుల టేక్‌హోం జీతంలో 25 శాతానికి సమానమైన మొత్తాన్ని వారి భార్యలకు ‘హోం సాలరీ’గా ఇస్తామని వెల్లడించారు. జీతం ఒకటే కాదు.. ఉద్యోగులు పొందే ప్రోత్సాహకాలు, బోనస్‌, షేర్లపై 25 శాతం వారి భార్యలకు కేటాయిస్తామని చెప్పారు. అయితే సంస్థలో మూడేళ్లకు మించి పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుందని సంస్థ నిబంధన పెట్టింది.

సంస్థ సీఈవోగా వ్యవహరిస్తున్న రాయ్‌.. తన ఉద్యోగులను సొంత మనుషులుగా చూసుకుంటారు. సంస్థ షేర్లలో, వచ్చే లాభాల్లో ఉద్యోగులకు 50శాతం కేటాయిస్తారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలోనూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యోగులను తొలగించలేదు. వారి జీతాలు తగ్గించలేదు. ఉద్యోగులు కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించడమే గొప్ప విషయంగా ఆయన చెబుతుంటారు. అయితే, ఈ క్రమంలో ఉద్యోగులు విధులను ఏ చింత లేకుండా నిర్వర్తిస్తున్నారంటే అందుకు వారి భార్యలే కారణమని రాయ్‌ నమ్ముతారు. ‘భర్త.. పిల్లల కోసం ఇంట్లో గృహిణులు పడే కష్టానికి పెద్దగా విలువ ఇవ్వరు. ఉద్యోగులకు వారాంతాల్లో సెలవులు ఉంటాయి. కానీ, గృహిణులకు అలాంటివేవి ఉండవు. వారి కష్టాన్ని గుర్తించాల్సిన అవసరముంది’అని ఎరిస్‌ సంస్థ సీఈవో అభిప్రాయపడ్డారు.

అందుకే తొలిసారి ఉద్యోగులతోపాటు ఉద్యోగుల భార్యలకు వేతనమిచ్చే ‘హోం సాలరీ’ పాలసీని తీసుకొచ్చామని రాయ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల భార్యల వివరాలు సేకరిస్తున్నారట. ఎవరైతే ఉద్యోగం చేయట్లేరో వారి జాబితా తయారు చేసి త్వరలో జీతాలు ఇవ్వడం మొదలుపెడతామని చెప్పారు. సంస్థ ఉన్నంత వరకు ఈ పాలసీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో రాయ్‌ ఉదారతకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. గొప్ప మనసున్న వ్యక్తంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. పన్నెండేళ్ల కిందటే ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్‌ ఇచ్చే పాలసీని ఎరిస్‌ సంస్థ అమలు చేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని