Corona టీకా కావాలా.. రష్యా ట్రిప్‌కు రండి..!

కరోనా దెబ్బకు పర్యాటక రంగం బెంబేలెత్తింది. చాలా దేశాలు ఆంక్షల పేరుతో అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసి నో ఎంట్రీ బోర్డులు పెట్టేశాయి. ఇలాంటి సమయంలో రల్డ్‌ టూర్‌

Published : 19 May 2021 22:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా దెబ్బకు పర్యాటక రంగం బెంబేలెత్తింది. చాలా దేశాలు ఆంక్షల పేరుతో అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసి నో ఎంట్రీ బోర్డులు పెట్టేశాయి. ఇలాంటి సమయంలో వరల్డ్‌ టూర్‌ అంటే ఇప్పుడు ఓ కలలా మారిపోయింది. అయితే పరిస్థితులను అవకాశాలు మల్చుకుంటున్న కొన్ని పర్యాటక రంగ సంస్థలు.. ‘వ్యాక్సిన్‌ టూరిజం’కు తెరతీశాయి. అంటే  విహారయాత్రలకు తీసుకెళ్లి అక్కడ కరోనా టీకాలు వేయించడం అన్నమాట. తాజాగా ఓ దుబాయి కంపెనీ భారత పర్యాటకులకు ఇలాంటి ఆఫర్‌ ఒకటి ప్రకటించింది. 

దుబాయి కేంద్రంగా పనిచేస్తోన్న ఓ ట్రావెల్‌ ఏజెన్సీ దిల్లీ నుంచి మాస్కోకు 24 రోజుల ప్యాకేజీని ప్రారంభించింది. దీని కింద పర్యాటకులను రష్యా విహారయాత్రకు తీసుకెళ్లడంతో పాటు రెండు డోసుల ‘స్పుత్నిక్‌ వి’ టీకా కూడా ఇప్పించనుంది. తొలి డోసు.. రెండో డోసు మధ్య వ్యవధిలో పర్యాటకులను సైట్‌ సీయింగ్‌కు తీసుకెళ్లనుంది. ‘‘కరోనా టీకా వేసుకోలేదా.. రష్యా ట్రిప్‌కు రండి.. 24  రాత్రులు.. 25 రోజుల ఈ టూర్‌లో రెండు డోసుల టీకాలు వేయిస్తాం. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 3-స్టార్‌ హోటల్‌లో నాలుగు రోజుల బస, ఆ తర్వాత మాస్కోలోని 3-స్టార్‌ హోటల్‌లో 20 రోజుల వసతి, రెండు టీకాలు ఇప్పిస్తాం’’అని సదరు ట్రావెల్‌ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 

మరి ఈ ట్రిప్‌ ధర ఎంతో తెలుసా.. అక్షరాలా.. రూ. 1.29లక్షలు. ఇందులో స్పుత్నిక్‌ వి టీకా ధర, విమాన టికెట్ల ఖర్చులు, రష్యాలోని పర్యాటక స్థలాల ప్రవేశ రుసుములు అన్నీ ఉండనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా.. భారత్‌లో వ్యాక్సిన్ల కొరత ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్‌కు డిమాండ్‌ కూడా భారీగానే వస్తోందట. ఇప్పటికే మూడు బ్యాచ్‌లు పూర్తిగా నిండిపోయినట్లు ట్రావెల్‌ ఏజెన్సీ పేర్కొంది. తొలి బ్యాచ్‌ మే 29న, రెండో బ్యాచ్‌ జూన్‌ 7న, మూడో బ్యాచ్‌ జూన్‌ 15న మాస్కో బయల్దేరనుందని చెప్పింది. ప్రస్తుతానికి రష్యాలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు లేవు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని