Prabhas: ‘రామ్‌లీలా’లో దసరా వేడుకలు.. రావణ దహనం చేసిన ప్రభాస్‌

దేశ రాజధాని నగరం దిల్లీలో దసరా వేడుకల్లో ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ సందడి చేశారు. ఎర్రకోట వద్ద రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఆదిపురుష్‌’ని చూసేందుకు...

Published : 06 Oct 2022 01:42 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో దసరా వేడుకల్లో ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ సందడి చేశారు. ఎర్రకోట వద్ద రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఆదిపురుష్‌’ని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. మరోవైపు, దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ముగింపు ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య కోలాహలంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గామాత వివిధ అలంకారాల్లో భక్తులనుంచి విశేష పూజలందుకున్నారు. ఈ వేడుకల్లో చివరి రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణదహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ రాజధాని దిల్లీతో పాటు పలు నగరాలు, పట్టణాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున  తరలివచ్చారు. దిల్లీలో జరిగిన ముగింపు వేడుకలు ఆబాల గోపాలాన్ని అలరించాయి. ఈ వేడుకల్లో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహా కావ్యం రామాయణంలోని పలు ఘట్టాలను కళాకారులు ప్రదర్శించగా.. ఈ సన్నివేశాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

రామ్‌లీలా మైదానంలో జరిగిన వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కడ్‌, ఎల్జీ వీకే సక్సేనా, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ తదితరులు హాజరై రామబాణాన్ని సంధించారు. అనంతరం రావణ దహనం చేశారు. అయితే, దిల్లీలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆమె హాజరుకాలేకపోయినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా భారీ ఎత్తున నవరాత్రి ఉత్సవాలు జరగని విషయం తెలిసిందే. దీంతో ఈసారి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. లక్షల సంఖ్యలో పాసులు పంపిణీ చేశారు. రామ్‌లీలా మైదానంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

హరియాణాలో అపశ్రుతి 

హరియాణాలో జరిగిన దసరా ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.  రావణ దహనం అనంతరం ప్రజలు అత్యుత్సాహంతో ముందుకెళ్లడంతో వారిపై దిష్టిబొమ్మలు పడ్డాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts