Ukraine Crisis: భారత్‌ నుంచి గట్టి కౌంటర్‌.. ట్వీట్ డిలీట్‌ చేసిన డచ్‌ రాయబారి

ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో భారత్‌కు సలహా ఇవ్వబోయి, గట్టిగానే ఎదురుదెబ్బ తిన్నారు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్‌ ఓస్టెరోమ్‌.

Updated : 07 May 2022 15:16 IST

దిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో భారత్‌కు సలహా ఇవ్వబోయి, గట్టిగానే ఎదురుదెబ్బ తిన్నారు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్‌ ఓస్టెరోమ్‌. ఐక్యరాజ్య సమితి విధివిధానాలను గౌరవించాలంటూ ఆయన చేసిన సూచనకు మన దేశం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ క్రమంలోనే సదరు రాయబారి తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు. 

అసలు విషయం ఏంటంటే..ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న దండయాత్రను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ సభలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంటూ తటస్థ వైఖరిని పాటిస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల యూకేలో నెదర్లాండ్స్‌ రాయబారిగా ఉన్న కారెల్‌ వాన్‌ ఓస్టెరోమ్‌ దీనిపై స్పందిస్తూ.. ‘‘ఐక్యరాజ్యసమితి విధివిధానాలను మీరు (భారత్‌ను ఉద్దేశిస్తూ) గౌరవించాలి. జనరల్‌ అసెంబ్లీలో ఓటింగ్‌కు దూరంగా ఉండకూడదు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఉక్రెయిన్‌ వ్యవహారంపై ఐరాస భద్రతా మండలిలో ఈ వారం జరిగిన సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి ఈ ట్వీట్‌ గురించి ప్రస్తావిస్తూ డచ్‌ రాయబారికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. భారత్‌కు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, తామేం చేస్తున్నామో తమకు పూర్తిగా అవగాహన ఉందని తిరుమూర్తి తెలిపారు. ఐరాస విధానాలు, అంతర్జాతీయ చట్టాలను తాము పాటిస్తామని, అదే సమయంలో అన్ని దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవమిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని