
Covid vaccine cost: బహిరంగ మార్కెట్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఒక్కో డోసు ₹275!
దిల్లీ: మన దేశంలో అభివృద్ధి పరిచిన కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు త్వరలోనే బహిరంగ మార్కెట్లోకి రానున్నాయి. అయితే, వీటి ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఒక్కో డోసు ధరను రూ.275కు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా సర్వీసు ఛార్జీ కింద మరో రూ.150 చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవాగ్జిన్ డోసు ధర రూ.1200 ఉండగా.. కొవిషీల్డ్ డోసు రూ.780గా ఉంది. దీనికి రూ.150 సర్వీసు ఛార్జీ అదనం.
ప్రస్తుతం ఈ రెండు వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్నాయి. అయితే, కొన్ని షరతులకు లోబడి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను బహిరంగ విపణిలోకి అనుమతించేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ జనవరి 19న సిఫార్సు చేసింది. తమ టీకాలను బహిరంగ విపణిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనుమతించాల్సిందిగా కొవిషీల్డ్ తయారీదారైన సీఐఐ, కొవాగ్జిన్‌ను అభివృద్ధిపరిచిన భారత్ బయోటెక్ సంస్థలు విడివిడిగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ ఈ టీకాలకు బహిరంగ విపణి అనుమతులను జారీ చేయవచ్చని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గతేడాది జనవరి 3న ఈ రెండు టీకాలకు కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.