Earthquake: హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం: 304కు చేరిన మృతుల సంఖ్య 

కరీబియన్‌ దేశమైన హైతీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే చెప్పింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు 304 మంది మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు

Updated : 15 Aug 2021 09:41 IST

హైతీ: కరీబియన్‌ దేశమైన హైతీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే చెప్పింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు 304 మంది మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసిన యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అనంతరం ఉపసంహరించుకుంది. రాజధాని నగరం పోర్ట్‌-ఓ-ప్రిన్స్‌కు 125 కి.మీల దూరంలో, పశ్చిమ హైతీలోని సెయింట్‌ లూయిస్‌-డు-సుడ్‌కు 12 కి.మీల దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని నగరం పోర్ట్‌-ఓ-ప్రిన్స్‌తో పాటు సమీప దేశాల్లో భూప్రకంపనలు వచ్చాయి. 

ఈ భూకంపం దేశంలోని పలు చోట్ల ప్రాణ, భారీ ఆస్తి నష్టాన్ని కలిగించినట్లు హైతీ కొత్త ప్రధాని ఏరియల్‌ హెన్రీ తెలిపారు. భూప్రకంపనల ధాటికి పలు చోట్ల భవనాలు, వేల ఇళ్లు కుప్పకూలాయి. ప్రజలు భయాందోళలతో రోడ్లపైకి పరుగులు తీశారు. గాయపడినవారిని విపత్తు, సహాయ బృందాలు సమీప ఆసుపత్రులకు తరలించాయి. నెలరోజుల పాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. బాధితులకు సహాయం చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మృతులకు ప్రధాని సంతాపం తెలిపారు. హైతీకి వెంటనే సాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారులను ఆదేశించారు. 

2010లో కూడా రిక్టర్‌ స్కేల్‌పై 7 తీవ్రతతో వచ్చిన భూకంపం ఈ పేద దేశాన్ని కుంగదీసింది. 2 లక్షలకు పైనే మృతి చెందారు. దాదాపు 3 లక్షల మంది క్షతగాత్రులయినట్లు అంచనా. ఎక్కడికక్కడ భవనాలు కుప్పకూలాయి. అపార ఆస్తినష్టం కలిగింది. లక్షల్లో నిరాశ్రయులయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ దేశానికి ఇప్పుడు వచ్చిన భూకంపం మరో పిడుగులాంటిదే.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని