India-China: భారత్‌-చైనా మధ్య సంబంధాలు.. సాధారణంగా ఏం లేవు..!

భారత్‌, చైనా మధ్య సంబంధాలు ఏ మాత్రం సాధారణంగా లేవని, సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటేనే అది సాధ్యమవుతుందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌

Updated : 29 Feb 2024 16:54 IST

వాంగ్‌ యీతో భేటీ తర్వాత జైశంకర్‌ వెల్లడి

దిల్లీ: భారత్‌, చైనా మధ్య సంబంధాలు ఏ మాత్రం సాధారణంగా లేవని, సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటేనే అది సాధ్యమవుతుందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. గల్వాన్‌ ఘర్షణల తర్వాత తొలిసారిగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ నేడు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను జైశంకర్‌ మీడియాకు వెల్లడించారు.  

‘‘సరిహద్దులో చైనా బలగాల మోహరింపుతో ఏప్రిల్ 2020 నుంచి ఘర్షణలు, ఉద్రిక్తతలు పెరిగాయి. కేవలం ద్వైపాక్షిక సంబంధాలతో ఇవి కొలిక్కి వచ్చే అవకాశం లేదు. పూర్తి స్థాయి చర్చలతోనే అది సాధ్యమవుతుంది. ఉద్రిక్తతలపై చర్చలు జరగాలంటే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ పూర్తి కావాలి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితుల్లో కొంత పురోగతి ఉందని నేను చెప్పగలను. అయితే ఈ పురోగతి అనుకున్నంత వేగంగా సాగట్లేదు. చైనాతో భారత్‌ సంబంధాలు సాధారణంగా ఉన్నాయా? అంటే లేవనే చెబుతాను. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితిని చేరుకుంటాయి. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకే మేం ప్రయత్నిస్తున్నాం’’ అని జైశంకర్‌ తెలిపారు. 

సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగకూడదని, ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రికి నిజాయతీగా చెప్పామని జైశంకర్‌ అన్నారు. సరిహద్దు వివాదంతో పాటు ఉగ్రవాదం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర అంశాలపై తాము చర్చించినట్లు తెలిపారు. క్వాడ్ సదస్సు ప్రస్తావన తమ మధ్య రాలేదన్నారు. ఇటీవల పాక్‌ పర్యటన సమయంలో కశ్మీర్‌ అంశంపై వాంగ్‌ చేసిన వ్యాఖ్యల విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. ‘‘భారత్‌కు సంబంధించిన విషయాల్లో ఏ ఇతర దేశాల ప్రభావానికి లోను కాకుండా చైనా స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, భారత అంతర్గత వ్యవహారాలకు గౌరవం ఇస్తుందని మేం ఆశిస్తున్నాం. ఈ విషయాన్ని వాంగ్‌కు స్పష్టంగా చెప్పాం’’ అని జైశంకర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని